టీమిండియాకు తప్పని ఇబ్బందులు

మన తెలంగాణ/క్రీడా విభాగం: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తరచు గాయాల బారిన పడుతున్నాడు. దీని ప్రభావం జట్టుపై బాగానే పడుతోంది. తాజాగా శ్రీలంక గడ్డపై జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. కొన్నేళ్లుగా బుమ్రా గాయాలతో సహవాసం చేస్తున్నాడు. అతన్ని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. కీలకమైన సిరీస్‌లకు, టోర్నమెంట్‌లకు దూరంగా ఉండక తప్పడం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా పేరు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ నిలకడైన ప్రదర్శనతో టీమిండియాకు ప్రధాన అస్త్రంగా మారాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతని ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే. పిచ్ ఏదైనా తన స్వింగ్‌తో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం అతనికి పరిపాటిగా మారింది. చాలా రోజుల నుంచి భారత జట్టు బౌలింగ్ భారాన్ని బుమ్రానే మోస్తున్నాడు.

సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో జరిగే సిరీస్‌లలో, టోర్నీలలో మెరుగైన ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కానీ గత నాలుగైదేళ్లుగా బుమ్రా తరచు గాయాల బారిన పడుతున్నాడు. వరుస గాయాలతో జట్టుకు అందుబాటులో లేకుండా పోతున్నాడు. దీని ప్రభావం జట్టుపై బాగానే పడుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బుమ్రా సేవలు కోల్పోవడం టీమిండియాకు ప్రతికూలంగా మారింది. ఎంతో కీలకమైన శ్రీలంక సిరీస్‌లోనూ అతను జట్టుకు అందుబాటులో ఉండడం లేదు. రానున్న వన్డే ప్రపంచకప్‌తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సిరీస్‌లు జరుగనున్న నేపథ్యంలో బుమ్రా గాయాల నుంచి తిరిగి జట్టులోకి చేరక తప్పదు. ఇక బిసిసిఐ కూడా అతన్ని ముఖ్యమైన సిరీస్‌లలో మాత్రమే ఆడించాలి. బుమ్రా కూడా ఐపిఎల్ వంటి పెద్ద టోర్నీలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అంతేగాక ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే అతనితో పాటు టీమిండియాకు ప్రయోజనంగా ఉంటుంది.