ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే జింక్స్ తాజాగా ఓ పాడ్‌క్యాస్ట్‌లో టెస్ట్ క్రికెట్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు పూర్వ వైభవం రావాలంటే.. ప్రస్తుతం ఉన్న సీనియర్ ఆటగాళ్లను జట్టులో కొనసాగించాలని అన్నాడు. సీనియర్లు ఒకేసారి ఆటకు దూరమవుతుండటం టీం ఇండియాకు సమస్యగా మారిందని పేర్కొన్నాడు.

‘‘గత రెండేళ్లుగా నేను టెస్ట్ క్రికెట్ ఆడకపోవడంతో ఇంట్లోనే కూర్చొని మ్యాచ్‌లు వీక్షించా. భారత జట్టు స్వదేశంలోనే మ్యాచ్‌లు ఓడిపోవడం కూడా చూశా. టెస్టు క్రికెట్ ఆడాలంటే పట్టుదల ఉండాలి. దాన్ని భారత ఆటగాళ్లు పెంపొందించుకుని పోటీతత్వంతో కూడిన క్రికెట్ ఆడాలి. ప్రతి సెషన్ పూర్తిగా ఆడాలి. చాలా జట్లు అలా చేయడం లేదు. నేను ఏ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పదల్చుకోలేదు. భారత టెస్టు క్రికెట్‌లోకి గత రెండేళ్లలో కొత్త ఆటగాళ్లు వచ్చారు. వాళ్ల సంగతి పక్కన పెట్టండి.

టెస్ట్ జట్టులో 7-8 మంది సీనియర్లు, ఇద్దరు లేదా ముగ్గురు యువ ఆటగాళ్లు ఉండాలనేది నా అభిప్రాయం. కానీ, ఇప్పుడు జట్టు కొత్త వాళ్లతో నిండిపోతోంి. దాదాపు సీనియర్ ఆటగాళ్లంతా రిటైర్ అయ్యారు. మిగిలిన అనుభవజ్ఞులైన ఆటగాళ్లను గౌరవించడం చాలా అవసరం. నిజం చెప్పాలంటే టెస్టు క్రికెట్ గురించి నాకు భయంగా ఉంది. ఇది మనుగడ సాగించాలని మనం కోరుకోవాలి. ముఖ్యంగా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల్లో టెస్టు క్రికెట్ కొనసాగాలి’’ అని రమానే అన్నాడు.