
చార్మింగ్ స్టార్ శర్వా హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ భారీగా రూపొందించిన 22 రోజుల క్లైమాక్స్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.
ఈ క్లైమాక్స్‌కు ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ యాక్షన్‌ను డిజైన్ చేశారు. థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చే స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది. సినిమాలో ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న శర్వా తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 1960 నేపథ్యంలో తెలంగాణ, -మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్ లో సాగుతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ’భోగి’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.











