నాగాలాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 12 మంది గాయాలయ్యాయి. పది నుంచి పదిహేను ఇళ్లు దెబ్బ తినగా.. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని భావిస్తున్నారు. నాగాలాండ్ పోలీసులు సహా అస్సాం రైఫిల్స్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఆదివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి మోన్ జిల్లా కేంద్రం వణికిపోయింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, రోడ్లు, మౌలికసదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.