లద్దాఖ్: భారత్ యుద్ధనౌకలను రూపకల్పన చేస్తోంది: రాజ్ నాథ్ సింగ్  పాకిస్థాన్ మాత్రం చొరబాటుకు కొత్త మార్గాలను వెతుకుతోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తోందని అన్నారు. కార్గిల్ అమరవీరులకు సైన్యం ఘననివాళి అర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా ద్రాస్ సెక్టార్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ యుద్ధనౌకలను రూపకల్పన చేస్తోందని, పాకిస్థాన్ ఉగ్రవాదానికి రూపకల్పన చేయడంలో నిమగ్నమై ఉందని తెలియజేశారు. భారత్ స్టార్టప్ వ్యవస్థను సృష్టిస్తుంటే, పాకిస్థాన్ ఉగ్రవాద వ్యవస్థను సృష్టిస్తోందని, భారత్ సెమీకండక్టర్లను తయారు చేస్తోందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆత్మాహుతి దళాలను ఉత్పత్తి చేస్తోందని, భారత్ అంతరిక్ష యాత్రలకు ప్రసిద్ధి చెందితే.. పాకిస్థాన్ ప్రాక్సీ మిషన్లను నిర్వహిస్తోందని అన్నారు. భారత్ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తోందని, పాకిస్థాన్ సరిహద్దు అవతలకు ఉగ్రవాదులను పంపడంలోనే నిమగ్నమైందని చెప్పారు. భారత్ డేటా సెంటర్ లను నిర్మిస్తుంటే..పాకిస్థాన్ రాడికలైజేషన్ కేంద్రాలు నిర్మిస్తోందని, భారత్ యూపిఐ ద్వారా ప్రపంచాన్ని అనుసంధానిస్తోందని అన్నారు. పాకిస్థాన్ హవాలా ద్వారా ఉగ్రవాదాన్ని అనుసంధానిస్తోందని, పాకిస్థాన్ దుష్ట పన్నాగాలతో మన పురోగతిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని, పాకిస్థాన్ సరైన సమాధానం ఇవ్వడానికి మన సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ సవాల్ విసిరారు.