
భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ 18 రోజుల పసికందు మరణానికి దారితీసింది. కన్న తండ్రే కసాయిగా మారాడు. రక్తం పంచుకొని పుట్టిన 18 రోజుల కొడుకు అని కూడా చూడకుండా నేలకోసి కొట్టడంతో పాపం ఆ పసికందు మృతి చెందాడు. ఈ సంఘటన జోగిపేట పట్టణంలోని భరత్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన పోతురాజు కృష్ణ (కిట్టు) అల్లం గౌరమ్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రోజు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి మధ్య కొంతకాలంగా తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
శనివారం ఉదయం భార్య వంట చేయకపోవడంతో మళ్లీ ఇరువురి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. భార్యపై దాడి చేసిన భర్త అంతటితో ఊరుకోకుండా ఉయ్యాలలో నిద్రిస్తున్న పసికందు కాళ్లను పట్టుకొని నేలకేసి కొట్టడంతో ఆ పసికందు స్పృహ కోల్పొయాడు. భార్య అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి పసికందును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మార్గమధ్యలోనే ఆ పసికందు ప్రాణాలు విడిచాడు. భార్య అల్లం గౌరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కృష్ణను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ గిరి శ్రీకాంత్ తెలిపాడు.











