మన తెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎవరికీ నష్టం కలగనీయదు అని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం రైతులు భూములిచ్చి సహకరించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. అందరికీ కచ్చితంగా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు వారికి వివరించి నచ్చజెప్పాలన్నారు. అప్పుడే ప్రపంచస్థాయి నగరానికి పునాదులు పడతాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫ్యూచర్ సిటీకి భూములిచ్చే రైతులను ఆదుకునే బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. చట్టపరంగా నోటిఫికేషన్లు, న్యాయపరమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యిందని తెలిపారు.భూమి ఇవాళ కాకపోతే రేపు అయినా ప్రభుత్వానికి బదిలీ అవుతుందని,

భూమి బదిలీ నిలిచిపోయే అవకాశం లేదని, తాత్కాలికంగా వాయిదా పడవచ్చని చెప్పారు. ప్రక్రియ జరిగినపుడే పరిహారం డబ్బులు తీసుకుంటే మరోచోట తక్కువ ధరకు భూములు వచ్చేవని రైతులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఆలస్యమైతే ఎకరాల్లో భూసేకరణ జరిగితే పరిహారం డబ్బులతో గజాల్లో కూడా వేరే చోట భూమి రాదని  పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎంఎల్‌ఎ మల్‌రెడ్డి రంగారెడ్డి, డిజిపి శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు.


భూమి కోల్పోతున్న బాధితుల పిల్లలకు స్కిల్స్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, ప్రజాప్రతినిధులు బాధితులతో మాట్లాడి అభద్రతా భావాన్ని తొలగించాలన్నారు. అభివృద్ధికి భూములిచ్చిన రైతులను గౌరవించాలని, స్థానికులు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుత నగరానికి పునాదులు వేగంగా పడతాయని పునరుద్ఘాటించారు. పేదల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సిఎం అధికారులకు సూచించారు. అందరూ సహకరిస్తే దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అద్భుతమైన నగర నిర్మాణానికి వేగంగా అడుగులు పడతాయని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేలా ఫ్యూచర్ సిటీని తీరిదిద్దుతామని తెలిపారు. దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్స్ మంజూరు చేస్తే మూడు బుల్లెట్ ట్రైన్స్ మన రాష్ట్రానికే వచ్చాయని, బెంగుళూరు- హైదరాబాద్, శంషాబాద్- పూనే, శంషాబాద్- అమరావతి- చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్‌కు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతుందని, అందరూ సహకరిస్తేనే అభివృద్ధి ఆ అద్భుతం ఆవిష్కృతమవుతుందని వ్యాఖ్యానించారు.

ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి -

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో అక్కడి ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ విలసిల్లుతుందని పేర్కొన్నారు. సర్పంచ్‌లు, కార్పొరేటర్లు ప్రభుత్వానికి సహకరిస్తేనే సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని అన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం జరిగితే ఫ్యూచర్ సిటీ పరిధి గ్రామాల ప్రజాప్రతినిధులకు పాస్ పంపాలని పోలీసులకు సూచించారు. కొంతమంది తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారని, ఆయా గ్రామాల్లో సభలు పెట్టి తీర్మానాలు చేసి కలెక్టర్, మంత్రికి పంపాలని తెలిపారు. ఆయా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో భాగం చేసే చర్యలు చేపడతామని చెప్పారు. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం అని పునరుద్ఘాటించారు.

అభివృద్ధి చేస్తామంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టారు

తాము అభివృద్ధి చేస్తామంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టారని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. మీరు ఏడుస్తూనే ఉండండి.. మేం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళతామని ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాక్షసుల కుల గురువు శుక్రాచార్యుడు అని, దేవతలు యజ్ఞాలు చేస్తుంటే శుక్రాచార్యుడు మారీచుడు, సుబాహుడును పంపి భగ్నం చేయాలని ప్రయత్నించే వారని అన్నారు. రాష్ట్రంలో కూడా ఫామ్ హౌస్‌లో ఉన్న శుక్రాచార్యుడు మన అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు మారీచుడు, సునాహుడిని పంపారని పరోక్షంగా కెసిఆర్‌ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు వేసి మాట్లాడే వాళ్ల మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా మావోయిస్టులు అడవుల్లో మిగిలిపోతే వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని సిఎం రేవంత్‌రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్యం,భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

జూన్ 2లోగా పూర్తి కావాలి

నాలుగో నగరంగా ఫ్యూచర్‌సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నామని, ఆదర్శ నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడుల ఒప్పందాలు ఇక్కడే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్‌లా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. జూన్ 2లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించుకుందామని అన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమిట్ ద్వారా ప్రపంచానికి విశ్వాసం కలిగిందని చెప్పారు. సైబరాబాద్, హైటెక్ సిటీ, ఓఆర్‌ఆర్, విమానాశ్రయ నిర్మాణం మన కళ్ల ముందే అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. అభివృద్ధి ప్రాంతాలుగా తీర్చిదిద్దిన ఆనాటి నాయకులను కొంతమంది అవహేళన చేశారని అన్నారు. దేశంలో ఏ నగరానికి లేనివిధంగా 160.500 కిలో మీటర్ల మేర ఒఆర్‌ఆర్ నిర్మించారని సిఎం గుర్తుచేశారు.