
మరో ఇద్దరికి గాయాలు మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి
ఎయిర్ కండీషనర్ పేలడంతో ఎగిసిపడిన మంటలు, క్షణాల్లో వ్యాప్తి
ఢిల్లీలోని వివేక్ విహార్‌లో తెల్లవారుజామున ఘటన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకటిన్నరేళ్ల చిన్నారితో సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలుడు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానిక నివాసి ఒకరు తెలిపారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో భవనం రెండో అంతస్తులో మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. వెంటనే 14 అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి పంపించి సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు అక్కడికి చేరుకునే సమయానికి మంటలు మూడో, నాలుగో అంతస్తులకు కూడా వ్యాపించినట్లు గుర్తించారు.
తూర్పు ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన వివేక్ విహార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భవనం నుంచి పన్నెండు మందికి పైగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని గురు తేగ్ బహదూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులందరి వివరాలను అధికారులు గుర్తించారు. రెండో అంతస్తులోనే అత్యధిక ప్రాణనష్టం సంభవించింది. అక్కడ అరవింద్ జైన్ (60), ఆయన భార్య అనితా జైన్ (58), కుమారుడు నిశాంత్ జైన్ (35), కోడలు అంచల్ జైన్ (33), మనవడు ఆకాష్ జైన్ (1.5) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మూడో అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారు నితిన్ జైన్ (50), ఆయన భార్య షైలీ జైన్ (48), కుమారుడు సమ్యక్ జైన్ (25)గా గుర్తించారు.
మొదటి అంతస్తులో శిఖా జైన్ (40) మృతి చెందగా, ఆమె భర్త నవీన్ జైన్ (48) గాయాలతో చికిత్స పొందుతున్నారు. సుమారు రెండు గంటలపాటు కొనసాగిన సహాయక చర్యల అనంతరం ఉదయం 6 గంటల సమయంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఘటనాస్థలికి సంబంధించిన దృశ్యాల్లో భవనం పలు భాగాలు పూర్తిగా కాలిపోయినట్లు, పై అంతస్తు నుంచి భారీగా పొగలు ఎగిసిపడుతున్నట్లు కనిపించింది. ఉదయం సుమారు 4 గంటల సమయంలో అగ్నిప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులను ఘటనాస్థలికి పంపాం. మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు రెండు గంటలు పట్టింది. అనంతరం గాలింపు చర్యలు చేపట్టాం అని షాహదరా డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా తెలిపారు. మృతదేహాలన్నింటినీ స్వాధీనం చేసుకుని ఢిల్లీ క్రైమ్ టీంకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వివేక్ విహార్‌లో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. స్థానిక పరిపాలన, డీడీఎంఏ, ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఢిల్లీ పోలీసులు సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని ఆమె తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ కార్పొరేటర్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానిక నివాసి ఒకరు తెలిపారు. ఏసీ పేలడంతో మంటలు వ్యాపించాయి. సుమారు 12 నుంచి 15 మందిని రక్షించారు అని ఆయన వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు.












