
తమిళనాడులోని పెరంబలూరు జిల్లా మంగళమేడు సమీపంలో చెన్నై- తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై బస్సు దగ్ధమయ్యింది. శనివారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి మదురై వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సులో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. రన్నింగ్ లో ఉన్న స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సులోని ప్రయాణికుల్ని కిందకు దించేశారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉండగా.. డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి వచ్చేలోపే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.











