రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా తెరకెక్కిన చిత్రం ‘రామాయణ’. ఈ దీపావళీ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి.. ఈ సినిమా ట్రైలర్‌ని అందులో ప్రదర్శించారు. ఈ రోజు (జూన్ 24)న ఆ ట్రైలర్‌ని యూట్యూబ్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అనుకోని కారణాల వల్ల ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు గల కారణాలను నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.

‘‘మా సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే నా కల ఇప్పుడు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో నిజమైంది. అందువల్ల ట్రైలర్ విడుదలని ముందుగా అనుకున్నట్లు కాకుండా వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీన గ్లోబల్ లాంచ్ చేస్తాము. భారతీయ సినీ చరిత్రలో 100 ఏళ్లకు పైగా ఇది ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలుస్తుంది. అంతర్జాతీయంగా రిలీజ్ చేయడంతో ‘రామాయణ’ ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతుంది. ఈ సినిమాతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు’’ అని నమిత్ మల్హోత్రా ఓ నోట్‌ని విడుదల చేశారు.