న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డీఎంకే కోరింది. ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్య ఆధారంగానే మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని పార్టీ స్పష్టం చేసింది. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత లోక్‌సభ బలాన్ని ఆధారంగా తీసుకుని మహిళల రిజర్వేషన్ బిల్లుకు డీఎంకే పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఆ ప్రక్రియ దక్షిణ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడితే, నియోజకవర్గాల పునర్విభజనను 25 సంవత్సరాల పాటు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరారు. మహిళల రిజర్వేషన్ అమలుతో పాటు డీలిమిటేషన్‌పై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని తిరుచి శివ డిమాండ్ చేశారు.