న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)పై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రణాళికలను అన్ని రాజకీయ పార్టీలకు వెల్లడించాలని కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని న రేంద్ర మోదీని కోరారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను మరో 25ఏళ్ల పాటు కొనసాగించాలని, అలాగే 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చే యాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మోదీకి రా సిన లేఖలో ఖర్గే.. డీలిమిటేషన్‌పై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రతిపాదించబోయే అంశాలను పరిశీలించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని సూచించారు. డిలిమిటేషన్ ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ తాను జులై 16న ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఖర్గే గుర్తుచేశారు. ప్రతిపాదనలను పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టే ముందు వాటిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలకు తగిన సమయం ఇవ్వాలని అప్పట్లో కోరినట్లు తెలిపారు. అయితే, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి బుధవారం రాత్రి ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో మరోసారి ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఖర్గే పేర్కొన్నారు.


వర్షాకాల సమావేశాలను ఇంకా ప్రొరోగ్ చేయకపోవడానికి ఇదే కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. డిలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉందని ఖర్గే చెప్పారు. మరో 25 ఏళ్ల పాటు లోక్‌సభ ప్రస్తుత బలం 543 స్థానాలుగానే కొనసాగాలి. అదేవిధంగా, ప్రతి రాష్ట్రానికి లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యను కూడా మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని కోరారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు మూడో వంతు (33 శాతం) రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశం నిర్వహించే ఆలోచన ఉంటే దానికి ముందే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, డిలిమిటేషన్‌పై కేంద్రం వద్ద ఉన్న ప్రతిపాదనలపై చర్చించాలని ఖర్గే కోరారు. వాటిని పరిశీలించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని అన్నారు. ఇది దేశానికి ఎంతో ప్రాధాన్యమున్న అంశమని ఖర్గే పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 16, 17 తేదీల్లో మీరు చేసినట్లుగా మరోసారి ఈ అంశాన్ని బలవంతంగా ఆమోదింపజేయడానికి ప్రయత్నించవద్దు అని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.


లోక్‌సభ స్థానాల సంఖ్యను కొంతకాలం పాటు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించడంతో పాటు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్లను కాంగ్రెస్ గతంలోనూ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తీర్మానంలోనూ ఈ రెండు డిమాండ్లకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. మహిళా రిజర్వేషన్ల అమలుకు డిలిమిటేషన్‌తో ముడిపడిన బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను ప్రధాని కోరడాన్ని కాంగ్రెస్ గతంలో ‘డ్రామా’గా అభివర్ణించింది. మోదీ లక్ష్యం మహిళా రిజర్వేషన్ కాదని, ‘మోదీ సంరక్షణే ఏకైక ఎజెండా’ అని ఆరోపించింది. ఏప్రిల్ 17న బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు డిలిమిటేషన్‌ను అనుసంధానిస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మోదీ ప్రభుత్వం లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రోజు ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది ఎంపీల్లో 298 మంది బిల్లుకు అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీతో కనీసం 352 ఓట్లు అవసరమయ్యాయి.

నేపాల్ వరద బాధితులకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలి

నేపాల్‌లో సంభవించిన తీవ్ర వరదలతో నష్టపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ విపత్కర సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఖర్గే ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చెప్పారు. నేపాల్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తీర్థయాత్రలకు, పర్యటనలకు వెళ్లిన వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మనందరినీ తీవ్రంగా కలచివేసింది. ఈ కష్టకాలంలో మనమంతా వారికి అండగా నిలవాలి అని ఖర్గే అన్నారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన..

వరదల్లో గల్లంతైన, చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని, ప్రాణాలతో బయటపడిన వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరారు. మృతుల భౌతికకాయాలను కూడా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వరదల్లో కొట్టుకుపోయినవారు, ఎక్కడైనా చిక్కుకుపోయినవారి ఆచూకీ తెలుసుకుని, వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ప్రయత్నాలు జరగాలి. అవసరమైన వారికి ఆర్థిక సాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించాలి అని ఖర్గే కోరారు. వరదల కారణంగా బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న నష్టాన్ని ‘భరించలేనిది’గా అభివర్ణించిన ఖర్గే.. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని వారికి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.