నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు లేకపోవడంతో మండలంలోని 30 గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న ప్రజలు పనులు పూర్తికాక పలుమార్లు వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. జుక్కల్ మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎంపీడీవో కార్యాలయంలో ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తుండగా, వారిలో ఒకరిని డిప్యూటేషన్‌పై బీర్కూర్ మండలానికి పంపించారు. మరో ఆపరేటర్ మెటర్నిటీ లీవ్‌లో ఉన్నారు. అదేవిధంగా కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌ను కూడా డిప్యూటేషన్‌పై డోంగ్లీ మండలానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
దీంతో కార్యాలయంలో సిబ్బంది కొరత ఏర్పడి, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు పూర్తికాక పలుమార్లు కార్యాలయానికి రావాల్సి వస్తుండటంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులను సైతం పక్కన పెట్టి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డిప్యూటేషన్‌పై ఇతర మండలాలకు పంపిన సిబ్బందిని తిరిగి జుక్కల్ ఎంపీడీవో కార్యాలయంలోనే విధులు నిర్వహించేలా జిల్లా అధికారులు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. సిబ్బంది కొరతను పరిష్కరించి ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.









