
బిఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు ఆ పార్టీ నేత హరీష్ రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకోసం తెరవెనుక కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. ఇటీవలే మెదక్ జిల్లా ఎంఎల్‌ఎలతో హరీష్ రహస్య మంతనాలు నిర్వహించారని, ఆ సమావేశంలో ఉన్న ఒకరు తనకు ఈ విషయాలు చెప్పారని అన్నారు. కెసిఆర్ వారసత్వం కెటిఆర్‌కు రావద్దని ఆ సమావేశంలో మాట్లాడారని చెప్పారు. బిఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు సిఎం రేవంత్‌రెడ్డితో, బిజెపితో దోస్తానా చేస్తున్నారని ఆరోపించారు. బిజెపితో హరీష్ రావు దోస్తీకి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయన్నారు. ఇప్పుడు తాను బిఆర్‌ఎస్‌లో లేను అని, ఆ పార్టీ ఎటు పోయినా తనకు సంబంధం లేదని అన్నారు. కానీ హరీష్‌రావు గురించి ప్రజలకు తెలియాలనే ఈ విషయం బయటకు చెబుతున్నానన్నారు.
తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రావాళ్ల చేతిలో బందీ అయ్యారని మండిపడ్డారు. బ్రహ్మణ పరిషత్‌కు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ను ఆంధ్రావాళ్లను నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మణ పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న బసవరాజు శ్రీనివాస రాజు అనే వ్యక్తి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణను ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ బ్రహ్మణులలో అర్హులు లేరా..? అని నిలదీశారు.యాదగిరి గుట్ట బోర్డు మెంబర్లలో ఆంధ్రా హీరో భార్యకు పదవి కట్టబెట్టారని విమర్శించారు. తెలంగాణ వాళ్ల పైసలతో కట్టిన గుడిలో ఆంధ్రావాళ్లకు పెత్తనం ఎలా ఇస్తారన్నారు. జనసేనకు చెందిన ఓ ఎంపీ కుమారుడు 6 కోట్ల కారు వేసుకోని ఒడిశాకు చెందిన 25 ఏళ్ల అమ్మాయిని గుద్ది చంపితే సిఎం పట్టించుకోలేదని పేర్కొన్నారు.











