రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు రవాణా రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో వాయు, శబ్ద కాలుష్యాలను తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లపై ఇంధన భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్- 2026’ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం ద్వారా తొలి విడతలో భాగంగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. హైదరాబాద్‌లోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని(ఓఆర్‌ఆర్ లోపు) పాత పెట్రోల్, డీజిల్ ఆటో డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా డ్రైవర్ల కోసం రెండు ప్రధాన ఆప్షన్లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

మొదటి ఆప్షన్ కింద ఉన్న పాత ఆటో ఇనుప చట్రం(ఫ్రేమ్)ను అలాగే ఉంచి, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ స్థానంలో ఏఐఎస్ 123 ప్రమాణాలు కలిగిన ఎలక్ట్రిక్ కిట్‌ను (ఫిక్స్‌డ్ లేదా స్వాపింగ్ బ్యాటరీతో) అమర్చుకోవచ్చు. రెండవ ఆప్షన్ కింద పాత ఆటోను స్క్రాప్ చేసి, కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రక్రియ మొత్తాన్ని 16 వారాల ప్రణాళికతో ఆన్‌లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా అమలు చేయనున్నారు. ఇలా కొత్త ఈవీ ఆటోలను కొనుగోలు చేసే డ్రైవర్లకు ప్రభుత్వం రూ.1.5 లక్షల వరకు సబ్సిడీని అందజేయనుంది. ఈ పథకం అమల్లోకి వస్తే ఆటో డ్రైవర్లకు ఇంధన ఖర్చులు పూర్తిగా తగ్గి ఆర్థికంగా భారీ లబ్ది చేకూరనుంది. అలాగే, నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ***