
మన తెలంగాణ/హైదరాబాద్: పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులను పట్టుకోవడం, అక్రమ ఆస్తులను రికవరీ చేయడంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంచేందుకు భారత్ చేసిన ప్రతిపాదనకు బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రి కా) నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. భారత అధ్యక్షతన జరుగుతున్న వివిధ రంగాల బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా నగరంలో నిర్వహించిన రెండవ బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యబృందం, ఆ స్తుల పునరుద్దరణ నిపుణుల నెట్‌వర్క్ సమావేశా లు బుధవారంతో ముగిశాయి. సిబ్బంది, శిక్షణ వి భాగం కార్యదర్శి రచనా షా ముందుగా సమావేశాన్ని ప్రారంభించి ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుపరిపాలన,
సుస్థిరాభివృద్ధి, ప్రజా విశ్వాసాలకు.. నైతికత, సమగ్రతలే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. బలమైన సంస్థలు, సాంకేతికత ప్రాతిపదికగా పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, నిరంతర అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను ఆమె ప్రస్తావించారు. బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యబృందం సాధారణ అవగాహనను పెంచుకునే వేదికగానే కాకుండా.. ఆచరణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టే దిశగా వేగంగా పరివర్తన చెందుతోందని కార్యదర్శి తెలిపారు. ప్రభావంతమైన అంతర్జాతీయ సహకారం సాధ్యపడాలంటే.. సకాలంలో సమాచార మార్పిడి, సంబంధిత అధికారిక సంస్థల మధ్య సత్వర సమన్వయం అవసరమని రచనా షా అభిప్రాయపడ్డారు.
అధికారిక పరస్పర చట్టపరమైన సాయం, నేరగాళ్ల అప్పగింత విధానాలకు తోడుగా.. క్షేత్రస్థాయి నిపుణుల మధ్య నమ్మకమైన సమాచార వినిమయ వ్యవస్థలూ అత్యంత కీలకమైనవని ఆమె తెలిపారు. దేశం దాటి పరారైన నేరగాళ్లను పట్టుకోవడంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం, నేరస్తుల అప్పగింత ప్రక్రియకు తోడ్పడడం లక్ష్యంగా.. బ్రిక్స్ దేశాల కోసం చట్టాలను అమలు చేసే నిపుణులతో అనుసంధానం కోసం అధ్యక్ష స్థానంలో భారత్ కీలక ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదిత నెట్‌వర్క్ లక్ష్యాలు, పరిధి, కార్యాచరణ విధానాలపై సభ్య దేశాలు నిర్మాణాత్మకంగా చర్చించి, సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. క్షేత్రస్థాయి నిపుణుల కోసం ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేందుకు చర్చలను కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమంతో అనధికారిక సహకారం పెరగడంతోపాటు.. పరారీలో ఉన్న నేరగాళ్లను గుర్తించడం సులభతరమవుతుందని, అధికారికంగా నేరస్తుల అప్పగింత కోసం ప్రస్తుతమున్న యంత్రాంగానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని బ్రిక్స్ దేశాల భావిస్తున్నారు. అవినీతికి పాల్పడి పరారైన నేరగాళ్లను గుర్తించడానికి, వారి అప్పగింతకు తోడ్పడటానికి ఉద్దేశించిన అనధికారిక సహకారంపై బ్రిక్స్ సమాచార నిధి (రిపాజిటరీ)ని కూడా సభ్య దేశాలు స్వాగతించాయి.
అధికారిక పరస్పర చట్టపరమైన సహాయ విధానాలకు తోడ్పడుతూనే.. దర్యాప్తు ప్రాథమిక దశల్లో క్షేత్రస్థాయి నిపుణుల మధ్య సకాలంలో సమాచార మార్పిడిని సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రమాణీకృత విధానాలపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. బ్రిక్స్ దేశాల్లోని అధికారిక సంస్థల మధ్య మరింత ప్రత్యక్ష సమాచార మార్పిడికి తోడ్పడే ప్రధాన అంశాలు, నిపుణుల డైరెక్టరీని కూడా నిపుణుల నెట్‌వర్క్ స్వాగతించింది. ఈ జాబితా ఎప్పటికప్పుడు కచ్చితంగా, కార్యాచరణకు ఉపయోగంగా ఉండేందుకు వీలుగా.. అదనంగా నిపుణులను నామినేట్ చేయడంతోపాటు, భవిష్యత్ బ్రిక్స్ అధ్యక్ష దేశాలు ఈ డైరెక్టరీని క్రమానుగతంగా సమీక్షించి నవీకరించేందుకు సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. అంతర్జాతీయ ఆస్తుల రికవరీకి సంబంధించి తమ అనుభవాలు, సంస్థాగత విధానాలు, ఆచరణాత్మక కేస్ స్టడీలను బ్రిక్స్ సభ్య దేశాలు పరస్పరం పంచుకున్నాయి. బ్రిక్స్ దేశాల్లోని పరిశోధకులు, నిపుణుల మధ్య నిరంతర జ్ఞాన భాగస్వామ్యం, మెరుగైన సహకారం విలువను ఈ చర్చలు స్పష్టం చేశాయి.
సమగ్ర డిజిటల్ సేకరణ వేదికలు విచక్షణారహిత జోక్యాలను, అవినీతి ముప్పును తగ్గిస్తూ... పారదర్శకత, ట్రేసబిలిటీ, నిష్పక్షపాత పోటీ, సామర్థ్యాలనూ మెరుగుపరుస్తాయని ఈ చర్చలు స్పష్టం చేశాయి. సరైన సంస్థాగత భద్రతా చర్యలు, మానవ పర్యవేక్షణల మద్దతుతో ఎప్పటికప్పుడు ప్రమాదాలను గుర్తించడం, ధ్రువీకరించడం ద్వారా... నివారణపరమైన అప్రమత్తత దిశగా పర్యవేక్షణను మళ్లించడంలో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, బిగ్-డేటా అనలిటిక్స్ సామర్థ్యాన్నీ సభ్యులు ప్రముఖంగా ప్రస్తావించారు. వర్ధమాన సాంకేతికతల చట్టబద్ధమైన నూతన ఆవిష్కరణ సామర్థ్యాన్ని పరిరక్షిస్తూనే... మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాద నిధుల నిరోధక భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసే స్పష్టమైన, ముప్పు-ఆధారిత నియంత్రణ విధానాల ఆవశ్యకతను సభ్యులు స్పష్టం చేశారు. అక్రమ డిజిటల్ ఆర్థిక లావాదేవీలు జరిగే వేగానికి అనుగుణంగా సమాచార మార్పిడినీ అందుబాటులోకి ఉంచడంపై బ్రిక్స్ సహకారం దృష్టి సారించాలనీ వారు ఉద్ఘాటించారు. భారత్ బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో కొనసాగిన కాలంలో సాధించిన పురోగతిని ఈ సమావేశాలు చర్చించాయి.








