‘మునిమాపు తొవ్వదప్పి తెల్లందాక దేవులాడింద’న్న తెలంగాణ సామెత మన ప్రభుత్వాల పనితీరు కు అద్దం పడుతోంది. దేశ యువతరం అంశాన్ని డీల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వమైనా, ‘ఎల్‌నినో వాతావరణ’ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వమైనా చేస్తున్నదదే! మసక వెలుతురైనా మాయం కాకముందే (మునిమాపు) దారితప్పి ఉండకపోతే తెల్లవార్లూ వెతుకులాట తిప్పలు తప్పుతాయి కదా! సమస్య వేళ్లూనుతున్నపుడో, జటిలం కాకముందో... సకాలంలో సర్కార్లు స్పందించి వుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎల్-నినో వాతావరణ ప్రతికూల ప్రభావం మీద ఉన్న ట్టుండి హడావుడి చేస్తోంది. సరైన కసరత్తు, హేతుబద్ధమైన విధివిధానాలు లేకుండానే ‘నిపుణుల కమిటీ’ ఏర్పాటు చేసి, అంతా దాంతోనే అయిపోతుందన్నట్టు వ్యవహరిస్తోంది. ‘గోరుచుట్టుపై రోకటి పోట’న్నట్టు ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న రైతన్నకు ఎల్-నినోతో వచ్చిన వర్షాభావ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. సీజన్ దాటిపోతున్నా ఇంకా అధిక శాతం భూముల్లో సాగు మొదలు కాలేదు. సాగు మొదలైన చోట వర్షాలు లేక విత్తిన విత్తనాలు, నారు ఎండవేడికి మాడిపోతున్నాయి. ఎప్పట్నుంచో వస్తున్న ఎల్‌నినో హెచ్చరికల్ని బేఖాతర్ చేసి, తగిన ముందుస్తు చర్యలు చేపట్టని నిర్లక్ష్యం వల్ల తలెత్తిన విపరిణామాలు ముదురుతున్నాయి.

దుక్కలు దున్ని, విత్తనాలు, -ఎరువులు సిద్ధం చేసుకొని సాగు మొదలెట్టాకో, ఒక్క బలమైన వానకోసం ఆకాశంవైపు ఆశగా చూస్తూ సాగుకు రైతు సన్నద్ధమైనప్పుడో ప్రభుత్వం కొత్తగా ‘అవగాహన’ మాటలు చెబుతోంది. వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల నిపుణులతో సదస్సులు నిర్వహిస్తోంది. పంట మార్పిడికి రైతు సిద్ధం కావాలని, ఎల్‌నినో ప్రభావంవల్ల తలెత్తిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాలని ఇప్పుడు పిలుపినిస్తోంది. స్వల్పకాలిక, ఆరుతడి పంటల సలహాలు, సూచనలు చేస్తూ ప్రత్యామ్నాయ పంటసాగు ప్రణాళిక రూపొందించాలని అధికారుల్ని ఆదేశిస్తోంది. సమస్యపై సర్కారుకు సరైన అవగాహన, పరిష్కారాలపై తగిన దృక్పథం లేదు అనడానికి ‘నిపుణుల కమిటీ’ ఏర్పాటు తీరే నిదర్శనం. కమిటీ కూర్పు, ప్రస్తావించిన అంశాలు, అప్పగించిన బాధ్యత, ఏర్పాటు సమయం నివేదికకు సమయ పరిమితులు లేని వైనం... అంతా అస్తవ్యస్తమే!

వాతావరణ మార్పుల్లో భాగంగా సముద్ర ఉపరితల గాలులు వేడెక్కడం వల్ల తలెత్తే ఎల్‌నినో ప్రతికూల ప్రభావాలపైన ప్రపంచమంతా కోడై కూస్తుంటే మనవాళ్లకు ఇంకా అనుమానాలే! నిపుణుల కమిటీ ఏర్పరస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో (జిఒ ఆర్‌టి నం : 427) ఎల్‌నినో ప్రభావం ఉండగల (లైక్లీ ఎఫెక్ట్) అవకాశాలను అంచనా వేయాలని నిర్దేశించారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, నికరంగా సగటు వర్షపాతం తగ్గి, సీజన్ ముగుస్తోందని రైతులు అల్లాడుతుంటే ‘ఎల్‌నినో ప్రభవం ఉండగల ఆస్కారం’ గురించి ఇంత ఆలస్యంగా, అనుమానాస్పదంగా పేర్కొనడమే విస్మయం కలిగిస్తోంది. కమిటీ కూర్పుతోపాటు వారికి అప్పగించిన పనులు బాధ్యతలు, ఇంకా పొందుపరచాల్సిన పలు అంశాలు సూచిస్తూ ప్రముఖ విధాన విశ్లేషకుడు ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఎల్‌నినో ప్రభావం ఎప్పుడో మొదలై, వ్యవసాయ ప్రతికూల వాతావరణం బలపడుతున్న దశలో ఇంకా ప్రాథమిక స్థాయి చర్యల్ని ఆయన ఈ లేఖలో తప్పుబట్టారు. చాలా అంశాల్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై పలు దిద్దుబాటు చర్యలు సత్వరం చేపట్టాలని సూచించారు. 27 మంది సభ్యుల్లో 8 మంది మాత్రమే సమాచారం, పరిశోధన, ప్రభావాల అంచనా, విశ్లేషణ, సిఫారసులు చేయగల స్థితిగలవారైతే 18 మంది సిఫార్సుల అమలు, ఆర్థిక నిర్వహణ స్థాయి కలిగి, నివేదికలను స్వీకరించే హోదాల వారున్నారని ఆయన విశ్లేషించారు. ఇక కమిటీకి చైర్మన్‌గా ఉన్న డా. జి.చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్రప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడి హోదాలో సమన్వయం సమర్థంగా నిర్వహించగలరు కానీ, ఇందులో ‘రాష్ట్ర ప్రణాళిక మండలి’ పాత్ర -ప్రమేయాలు ఏమిటని ప్రశ్నించారు. ఇదివరకే ఈ అంశంపై చేసిన కృషికి సమన్వయ పరచాలన్నారు. ఎల్‌నినో ప్రభావంవల్ల ఇప్పటికే జరిగిన నష్టంపై అధ్యయనం, అంచనాలలో ఒక మధ్యంతర నివేదిక ఇచ్చేలా కమిటీకి బాధ్యత అప్పగించాలని సూచించారు. సభ్యుల్లో అత్యధికులు ముందే బిజీగా ఉండేవారు కనుక, అనుభవజ్ఞులైన వారితో ఒక డ్రాప్టింగ్ సబ్ కమిటీనైనా ఏర్పాటు చేయాలి. అటు తర్వాతే పంటమార్పిళ్లు తదితరాలతో ప్రత్యామ్నాయ ప్రణాళిక, సిఫారసులతో సమగ్ర నివేదిక ఇస్తే సముచితంగా ఉంటుందన్నది ఈ లేఖలో స్థూల అభిప్రాయం.

ఎల్‌నినో ప్రతికూల ప్రభావాలను తట్టుకునేలా రైతుల్ని సన్నద్ధం చేయడానికి, సాగు విధానాల పద్ధతుల్ని సంస్కరించే సిఫారసులకు ముందు ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రభుత్వ పలు విధానాలను సమీక్షించాలి.రాగల మార్పుల దృష్ట్యా ప్రస్తుత సాగునీటి ప్రాజెక్టుల స్థితి -నిర్వహణ, విద్యుత్ సరఫరా పరిస్థితి, పంట ప్రోత్సాహకాలు, బీమా, భూగర్భజలాల నిబంధనలు.. వంటి పలు అంశాల్లో సమీక్ష, అవసరమైన మార్పులు తక్షణావసరం. ఇవన్నీ ఎప్పుడో జరగాల్సినవి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సిజిఆర్) వంటి పర్యావరణ రంగంలో పనిచేస్తున్న పలుసంస్థలు ఎల్‌నినో గురించి ఎప్పటి నుంచో చెబుతున్నాయి. అమెరికా, పలు ఐరోపా దేశాలు ఈ అంశాన్ని ఎంతో తీవ్రమైనదిగా పరిగణించి వారి దేశాల్లో చాలా కాలం కిందటే ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’ ప్రకటించి ఉన్నాయి. ఎల్‌నినోతోపాటు ఇతర ప్రభావకాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా రాగల ప్రమాదాలు, ముఖ్యంగా ద్వీపకల్పమైన భారత ఉపఖండంలో తలెత్తే ఉపద్రవాల గురించి శాస్త్రవేత్తలు ఇదివరకే హెచ్చరించారు. యుఎన్ ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల అధ్యయనం బృందం ఐపిసిసి పలు నివేదికల్లో ఈ హెచ్చరికలు చేసింది.

భారతదేశం ఎక్కువ ప్రభావితం అవుతుందని, అతివృష్టి -అనావృష్టి, వరదలు - కరువు, చలిగాలులు -వడగాలులు వంటి పరస్పర విరుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల భారత్‌లో వ్యవసాయం దెబ్బతిని, 21 నుంచి 27 శాతం వరకు ఆహారోత్పత్తి తగ్గే ప్రమాదాన్ని ఐపిసిసి నివేదిక అంచనా వేసింది. ఢిల్లీలోని క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీతో కలిసి సిజిఆర్ చాలా కాలం కిందటే ఢిల్లీలో ఒక సదస్సు ఏర్పాటు చేసి, దేశంలో ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయి. ‘నీతిఆయోగ్’కి కేంద్రం వాతావరణ మార్పులపై బాధ్యతలు అప్పగించినా ఆశించిన స్థాయిలో కృషి జరుగలేదు. ముందస్తు జాగ్రత్త చర్యలు (రెసిలిషన్స్), నష్టనివారణ చర్యలు (మిటిగేషన్), తప్పని వాటిని అలవర్చుకునే (అడాప్టేషన్) కార్యాచరణ నిర్దేశించడంలో గాని, సిఫారసుల పకడ్బందీ అమలులో గాని రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి.

రైతుల పక్షాన పంట మార్పిళ్లు జరగాలంటే ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక చర్యలతో ముందుకు రావాలి. ఏయే ప్రత్యామ్నాయ పంటకు ఎంత మేర కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇస్తారు, మార్కెట్ వ్యవస్థ కల్పిస్తారు. ఇన్‌పుట్ ఖర్చు తగ్గేలా చూస్తారు, పంటసేకరణ చేస్తారో ముందే సర్కారు ప్రకటన చేయాలి. నిర్దిష్టమైన బడ్జెట్‌తో ‘ధరల స్థిరీకరణ నిధి’ ని ఏర్పాటు చేయాలి. ఎల్-నినో ప్రభావాల అంచనా, ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ, ఇతర సిఫారసుల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటి గురువారం తొలి భేటీ జరిపింది. ఇందులో ఏయే అంశాలను ఎంత మేర చర్చించారు? ఏ దృక్పథంతో ముందుకు సాగుతున్నారో తెలియాల్సి ఉంది.

సర్కారు వైపు నుంచి విత్తనాల అందుబాటు, పంటల భీమా, ప్రభుత్వ సహకారం, మద్దతు ధర, మార్కెట్ సౌకర్యం, ఉత్పత్తుల సేకరణ.. వంటి విషయాల్లో భరోసా లేకుండా రైతు ఉన్నట్టుండి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లడానికి సాహసించకపోవచ్చు. కానీ, ఇన్నాళ్ల పరిస్థితివేరు, ఇప్పుడు ముంచుకు వచ్చిన ఎల్‌నినో ప్రతికూల వాతావరణ ప్రమాదం వేరు. ఇప్పటికే అటు వర్షాలు తగ్గి, ఇటు జలవిద్యుత్ ఉత్పత్తి పడిపోయి, భూగర్భ జలాలు అడుగంటి, సీజన్ దాటుతుంటే రైతు గొంతులోతు కష్టాల్లో కూరుకొని ఉన్నాడు. రైతుల దీనస్థితిపై అధ్యయనం చేసిన ‘తెలంగాణ వ్యవసాయం - రైతు సంక్షేమ కమిషన్’ రూపొందించిన నివేదిక ఉంది. ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో తగు సిఫారసులతో కమిషన్ ఇదివరకే నివేదిక సమర్పించింది. ఇప్పటికే కురిసిన అరకొర వర్షాలు, వర్షపాతం లోటు, కరువు స్థితి, రాగల సంక్షోభ పరిస్థితులపై వాతావరణ విభాగం (మెట్) వారి నివేదికలున్నాయి. ఒకవైపు సన్నాల (బియ్యం) సేకరణలో ధర ప్రోత్సాహం (బోనస్) ఇస్తూ మరోవైపు వరి, పత్తిని వదిలేసి ప్రత్యామ్నాయం వైపు వెళ్లాలనే పరస్పర విరుద్ధమైన ప్రభుత్వ విధానాల్ని రైతులు ఎలా స్వీకరిస్తారో చూడాలి. జిల్లా స్థాయిలో ప్రత్యామ్నాయ -వైవిధ్య పంటల సాగు గురించి ‘కేంద్ర పరిశోధనా సంస్థ (క్రిడా)’ ప్రణాళిక రూపొందించింది. వీటన్నిటితో పాటు పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ‘ఆత్మ’పరిశీలనాంశాలు తదితరాలను ‘నిపుణుల కమిటీ’ ఏ మేరకు పరిగణనలోకి తీసుకొని తాజా కార్యాచరణను సిఫారసు చేస్తుంది అన్నది వేచి చూడాల్సిందే!


దిలీప్‌రెడ్డి

(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)