
మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు డల్లాస్ నగరంలో నేడు ఘన స్వాగతం లభించింది. బాల్టిమోర్ నగరంలో గత మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ‘ఆట’ మహాసభల వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆ కార్యక్రమాల ముగింపు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి డల్లాస్ చేరుకున్నారు. డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు ఎన్‌ఆర్‌ఐ టీపీసీసీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రవాస భారతీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి తమ అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. కాగా డల్లాస్ నగరంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఉపకరించే విధంగా సింగరేణి అధికారుల బృందంతో కలిసి ఆయన ‘క్రిటికల్ మినరల్స్’ అంశంపై వివిధ బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు.
అత్యాధునిక సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఈ సమావేశాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా క్రిటికల్ మినరల్స్‌పై వివిధ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికిన వారిలో నెహ్రూ కొమ్మినేని, అచ్యుత్ తుమ్మల, మధు ఇరుగు, వసంత్ బొబ్బల, రాజ్ బెజ్జల, హరినాథ్ శీలం, వడ్డే రాజేష్, ప్రమోద్ రెడ్డి, రిషిత్ సలవాది, రేవంత్ రెడ్డి, దుష్యంత్ బొక్క, సందీప్ తదితరులు ఉన్నారు.











