
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెట్టాల్సిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. పేపర్ లీకుల పాలన మీదైతే...కొలువుల జాతర తమది అని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఖాళీలు భర్తీ చేయకుండా పదేళ్ళు కాలం గడిపి, ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయమైపోతున్నదని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తొలుత యువతకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించాలన్నారు.
కెటిఆర్ చేసిన ఆరోపణలకు అధికారిక గణాంకాలతో ఉద్యోగాల వివరాలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.యువ సంగ్రామ సభలో చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, యువతను మభ్యపెట్టే రాజకీయ ప్రయత్నాలు ఇకపై సాగవని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్కసారి కూడా వెళ్లి విద్యార్థుల సమస్యలు వినని నాయకులు, ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ చూపించడం రాజకీయ అవకాశవాదమేనని అన్నారు.











