
ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం చోటుచేసుకుంది. డోరు మూసే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ వ్యక్తి ప్రాణం పోయేందుకు దారి తీసింది. చుట్టూ జనం ఉండగానే ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, మయాంక్ లోహార్ మంగళవారం రాత్రి చర్చ్‌గేట్ నుంచి నల్లసోపారా వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కాడు. గోరేగావ్ - కందివాలి మధ్యలో తోటి ప్రయాణికుడితో మయాంక్‌కు గొడవైంది. వర్షం పడుతుండటంతో డోరు క్లోజ్ చేసే విషయంలో ఈ గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి మయాంక్‌పై కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మయాంక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ఏడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.












