
హుస్నాబాద్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడేలా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో సిద్దిపేట, కరీంనగర్ , హనుమకొండ ఆడిషన్ కలెక్టర్ లు, ఆర్డీవో లు , డిఎస్ఒలు, డిఎం సివిల్ సప్లయ్ అధికారులు, ఎమ్మార్వోలు, వ్యవసాయ అధికారులు ,ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంచార్జీలు, గ్రామాల వారిగా ధాన్యం కొనుగోలు కమిటీలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండడంతో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగ్స్ కొరత రాకుండా చూసుకోవాలని, సాయంకాలం వర్షాలు ధాన్యం తడవకుండా రైతులకు టార్ఫాలిన్ లు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం ఇటీవల వర్షానికి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ప్రతి గ్రామానికి వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ సమస్య వచ్చిన మా కార్యాలయం దృష్టికి తీసుకురావాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కొనుగోలు విషయంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మిల్లుల వద్ద సమస్యలు రావద్దని, ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలుపై కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంపై మానిటరింగ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం తరలింపు లో వాహనాల సమస్య రావద్దని, ప్రతి జిల్లాకు ఒక ఎంవిఐ అధికారిని ప్రత్యేకంగా వాహనాలు తరలించడానికి కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాటు చేయాలని డిటిసి లకు పొన్నం ఆదేశించారు. హామలీల కొరత లేకుండా చూసుకోవాలని, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో అడుగు పెట్టేంత స్థలం లేకుండా ధాన్యం వస్తున్నందున ఇప్పటికే ఐదు బృందాలు కాంట వేస్తున్నందున అదనంగా ఏర్పాటు చేయాలని, ఏ గ్రామం నుండి సమస్య వచ్చిన ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎఇఒ, గ్రామ కమిటీ కో ఆర్డినేట్ చేసుకోవాలని, ప్రధానంగా ధాన్యం అధికంగా వచ్చే అక్కన్నపేట, హుస్నాబాద్ టౌన్ , శనిగరం, కోహెడ , బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, శనిగరంలో రోజుకు 3-4 లారీలు వస్తున్నాయని, అదనంగా లారీలు లేదా ట్రాక్టర్ లను ఉపయోగించాలని, ఇక నుండి డే బై డే టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానని పొన్నం స్పష్టం చేశారు.














