
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా తాజా పర్యటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. నేడు సిఎం రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలిసింది. కేంద్రమంత్రులు సిఆర్ పాటిల్, భూపేంద్ర యాదవ్‌తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతో సిఎంతో భేటీ కానున్నట్టుగా సమాచారం.
ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, రీజనల్ రింగ్‌రోడ్డు భూసేకరణ, మెట్రో రైలు రెండో దశ విస్తరణకు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కేంద్రం నుంచి వచ్చే నిధులు, అనుమతులపై సంబంధిత కేంద్ర మంత్రులతో సిఎం చర్చించనున్నట్టుగా సమాచారం.
దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పెండింగ్ హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు, పన్నుల వాటాను త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిఎం రేవంత్‌రెడ్డి కోరనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, ప్యాకేజీలతో పాటు పండిన పంటలకు మద్దతు ధర, ఎరువుల సరఫరా వంటి అంశాలపై కేంద్రమంత్రులతో సిఎం చర్చించనున్నట్టుగా సమాచారం. దీంతోపాటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్‌తో సిఎం సమావేశం కానున్నట్టుగా తెలిసింది.











