
హైదరాబాద్: భూముల ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయని బిజెపి ఎంపి అర్వింద్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 72 ఏళ్ల వయసులోనూ కెసిఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, భారీగా బకాయిలు పెట్టి పోయారని విమర్శించారు. కెసిఆర్ హయాంలోనే సివిల్ సప్లయ్ లో అక్రమాలు ప్రారంభమయ్యాయని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాటి నుంచి కెసిఆర్ కోవర్టు అని అర్వింద్ తెలియజేశారు. కేంద్రం తెచ్చిన బిల్లులో కరెంట్ మీటర్ అనేది లేనేలేదని, రైతుల వద్ద కరెంట్ బిల్లు వసూలు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఆదివాసీలకు పోడుభూములకు పట్టాలు ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని, ఆదిలాబాద్ లో పోడుభూముల పట్టాలు అడిగిన మహిళలపై దౌర్జన్యాలు చేయించారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులను ఆదుకోలేదు కానీ, పంజాబ్ కు వెళ్లి చెక్కులు ఇచ్చి వచ్చారని ఎంపి అర్వింద్ ధ్వజమెత్తారు.













