
ఇస్లామాబాద్: కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియనున్న నేపథ్యంలో, అమెరికా ఇరాన్ మధ్య మలివిడత చర్చలు జరగనున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో సమావేశమయ్యే అవకాశముందని ఆ యా వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అ యితే, చర్చల సమయంపై అమెరికా లేదా ఇ రాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకారం, ఇ ప్పటివరకు తమ అధికార ప్రతినిధులు ఎవరూ పాకిస్తాన్ రాజధానికి చేరుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్ మధ్యవర్తుల సమాచారం మేరకు, అ మెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఖాలిబాఫ్ బుధవారం ఉదయం ఇస్లామాబాద్‌కు చేరుకు ని చర్చలకు నేతృత్వం వహించే అవకాశం ఉం దని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, గో ప్యతా నిబంధనల నేపథ్యంలో పేర్లు వెల్లడించకుండా ఉంచినట్లు సమాచారం. ఏప్రిల్ 8న ప్రారంభమైన కాల్పుల విరమణ ఒప్పందం బు ధవారం ముగియనుంది. ఇరు దేశాలు మాటల యుద్ధంలో మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తోంది.
ఒప్పందం కుదరకపోతే భారీ బాంబు ల దాడులు మొదలవుతాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఇరాన్ చర్చల ప్రధాన ప్రతినిధి ఇంకా బయటపెట్టని కొత్త వ్యూహాలు తమ వద్ద ఉన్నాయి అని పేర్కొన్నారు. అయితే చర్చలు పునఃప్రారంభమైతే కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా తరఫున జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు పాకిస్థాన్ కూడా ఇరాన్, అమెరికా బృందాల రాకను నిర్ధారించింది. ఇరు దేశాలు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. బుధవారంనాడు ఉదయానికల్లా రెండు దేశాల ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్ చేరుకుంటాయన్నారు. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలో ఒక బృందం, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ నాయకత్వంలో బృందం వస్తున్నాయని ప్రకటించింది.
ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
మలి విడత చర్చలకు దారులు పడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు మరోదారి లేదని, ఒప్పందానికి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాల్పుల విరమణను మరోసారి పొడిగించే ఉద్దేశం లేదన్నారు. ఒప్పదం చేసుకుంటేనే ఇరాన్ పరిస్థితి బాగుంటుందన్నారు. లేకపోతే మా సేనలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయని సిఎన్‌బిసితో మాట్లాడుతూ హెచ్చరించారు. ఈ సారి భీకరమైన దాడులు తప్పవని స్పష్టం చేశారు.
బెదిరింపుల నీడలో చర్చలా?
బెదిరింపుల నీడలో జరిగే చర్చలను మేము అంగీకరించము అని ఇరాన్ ప్రతినిధి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చర్చలు పునఃప్రారంభమవుతాయన్న ఆశాభావాన్ని పాకిస్థాన్ వ్యక్తం చేసింది. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్‌కు చేరుకునే అవకాశముందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. తద్వారా చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ అబ్దెలాత్తీతో తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఇదే సమయంలో, ఇరాన్‌కు ముఖ్య వాణిజ్య భాగస్వామి అయిన చైనా రాయబారితో కూడా సమావేశమయ్యారు. బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రస్తుత పరిస్థితి యుద్ధం నుంచి
శాంతి వైపు మారుతున్న కీలక దశలో ఉందని పేర్కొంది. ఈ సందర్భంలో అన్ని పక్షాలు నిజాయితీగా వ్యవహరించి, రాజకీయ పరిష్కారానికి కట్టుబడి ఉండాలని, కాల్పుల విరమణ, చర్చల వేగాన్ని కొనసాగించాలని మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ సూచించారు. ఇక ఇస్లామాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది భద్రతా సిబ్బందిని మోహరించి, విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లో పర్యవేక్షణను పెంచారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చల కంటే ఈసారి ఏర్పాట్లు మరింత కఠినంగా ఉన్నట్లు కనిపిస్తోంది. చర్చలు ముందుకు సాగితే, అమెరికాఇరాన్ అగ్రనేతలు పాకిస్థాన్‌ను సందర్శించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్లామాబాద్‌కు చెందిన భద్రతా విశ్లేషకుడు సయ్యద్ మహ్మద్ అలీ అభిప్రాయపడ్డారు. ఒప్పంద దశకు చర్చలు చేరితే, అగ్రనేతల పర్యటనకు అవకాశం ఉండొచ్చు అన్న భావనతో పాకిస్థాన్ సిద్ధమవుతోంది అని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.
