
దాదాపు మూడు దశాబ్దాల కల కలగానే మిగిలిపోనుందా అనే సందేహం మహిళలకే కాదు స్త్రీల ఉన్నతికి పాటుపడే వారందరి మదిలోమెదులుతున్న ప్రశ్న. 131 రాజ్యాంగ సవరణ మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడంపై రకరకాల అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. మహిళా బిల్లు వీగిపోవడం ఇప్పుడు కొత్తేంకాదు. సుమారు ఆరు ఏడు సార్లు అయింది. ఎన్‌డిఎ కూటమి ఏమో మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కలుపడంద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్ష నేతలు వ్యతిరేకించి ఓటు వేశారని అర్థమైంది. పార్లమెంట్ ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు రావడంతో ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతు 352 మెజారిటీ దక్కలేదు. 2/3 మెజారిటీకి 54 ఓట్లు తక్కువపడ్డాయి. మహిళా బిల్లు ఎన్‌డిఎ కుట్రలో భాగమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బిల్లు 2011 జనాభా లెక్కల ప్రకారం డీమిలిటేషన్‌తో ముడిపెట్టి ఓటింగ్ పెట్టడమే తప్పిదమని, బిజెపి చాణక్య నీతికి మించి అత్యుత్సాహం చూపుతున్నదని బలంగా వాదిస్తున్నారు ఇండియాకూటమి నేతలు. ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ రిజర్వేషన్‌పై కూడా స్పష్టతలేదు. అందుకే విపక్షాలు మద్దతు తెలుపలేదు. మహిళా బిల్లు వ్యతిరేకించిన వారిని దేశప్రజలు క్షమించరని, మహిళలను ఓటు అడిగే నైతిక హక్కు లేదంటుంది ఎన్‌డిఎ కూటమి.
మహిళా బిల్లుపై ఎవ్వరికి ఎంత బాధ్యత ఉంది అనేది భవిష్యత్తులో తేలనుంది. ఎవరి వాదనలు ఎలా ఉన్న మహిళలు చట్టసభలలోకి వెళ్లడం వారి హక్కు ఇకనైనా మహిళలపై గౌరవంతో వీలైనంత త్వరగా మహిళా బిల్లు ఆమోదానికై కలిసికట్టుగా పనిచేయాలి. మహిళా బిల్లుకు చట్టబద్ధతకు ఎన్‌డిఎ కూటమి ఆమోదించేలా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత విపక్షాలపై ఉంది. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వహించి చిత్తశుద్ధి కాపాడుకుంటారో ఆ పార్టీలను మహిళా లోకం గుర్తిస్తుందని మారువరాదు. దేశంలో కొన్ని రాష్ట్రాలు స్వయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చిన వారి అధికారులను కూడా తమ ఇంట్లో వారు అధికార దర్పం చాటుకుంటున్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛ లేదనే చెప్పవచ్చు. సమాన హక్కులతోపాటు చట్టసభల రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళలకు న్యాయం సంపూర్ణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిస్వార్థంగా మహిళా బిల్లును ఆమోదం తెలిపేలా చేసి ఉంటే మహిళల దృష్టిలో బిజెపికి ప్రత్యేకమైన ఆదరణ ఉండేదేమో.
రాజకీయ దూరదృష్టితో మహిళా బిల్లును కావాలనే సంపూర్ణ మద్దతు తెలుపడం లేదా అనే ఆలోచన మేధావులు, రాజకీయ విశ్లేషకులు, విద్యావంతులలో వస్తుంది. ఎందుకంటే జనాభా, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలి అంటున్నాం. చట్టసభలలో కూడా 50% జనాభా ఉన్న మహిళలకు రిజర్వేషన్ ఎక్కడ ఉంది, వారికి రావాల్సిన వాటా హక్కు ఇవ్వాలి కదా, ఎందుకు జాప్యం చేస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మహిళా బిల్లు రావాలి ఎందుకంటే శాసన నిర్మాణ, అభివృద్ధిలో మాహిళల పాత్ర ఉండాలి. ఈ సృష్టిలో నింగి నుండి నేల వరకు మహిళామణులు సేవలు అందిస్తున్నారు. రాజకీయాలలో మాత్రం మహిళలకు రావాల్సిన 33% పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 1/3 వంతు సీట్లు రిజర్వేషన్ అమలు చేయాలి కానీ మహిళా బిల్లు సుదీర్ఘ కాలంగా ఆమోదం పొందలేకపోయింది. చివరగా మహిళలు చైతన్యం అయితే తప్ప బిల్లు ముందుకు సాగదు. మహిళలు ఉద్యోగ విధులు నిర్వహించడమే కాకుండా ఇంట్లో వారికి సేవలు అందిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే స్త్రీ అంటే అబల కాదు సబల కావాలంటూ వీర వనితలను ఆదర్శంగా చూపెడుతాము. అలాంటిది దేశ రాజకీయాల్లో ఆశించిన ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం.
ఎందుకంటే స్వాతంత్య్ర పోరాటం మొదలుకుని సామాజిక ఉద్యమాల వరకు శంఖారావం పూరించిన ఘనత స్త్రీలదే అని చరిత్ర తెలుపుతుంది. స్త్రీలు ఏకమై కదంతొక్కుతూ ఉప్పెనలా కదిలితేనే మహిళా బిల్లు ఆమోదానికి అడుగులు పడతాయి. మహిళలను గౌరవించుకుంటూ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఘనంగా నిర్వహిచుకుంటూ మహిళలో చైతన్యం రావాలని నినదిస్తూ మహిళా బిల్లుపై అధికార, ప్రతిపక్షాలు మాటలు కోటలు దాటుతాయి. ఆచరణలోకి వచ్చే సరికి శూన్యం. పార్టీలు రాజకీయాలకు అతీతంగా మహిళల అభ్యున్నతి ముఖ్యమని భావించినప్పుడే మహిళా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ప్రపంచ ఉద్యమాలలో సైతం మహిళా పాత్రయే కీలకమైంది, మహిళలు వారి హక్కుల కోసం ప్రశ్నించే గళాలతో నినదించి పోరాడిన సందర్భాలు చూశాం. అదే ఒరవడితో మహిళా బిల్లుకై ఒక్కటై పోరాడాలి. 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి వారి హక్కులకోసం పని చేస్తుంది. ప్రతి ఏటా మహిళల సాధికారతకై ఒక థీమ్ తీసుకు వస్తూ వారి అభివృద్ధిని ప్రోత్సాహిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురుషులకు దీటుగా పోటీపడి అవార్డులు, రివార్డులు సాధిస్తున్నా వారి హక్కులను కాలరాస్తున్నాం. మహిళలను ప్రధానంగా పట్టిపీడించిన కొన్ని రుగ్మతలు బాల్యవివాహాలు, దేవదాసీ, సతీసహగమనం, నిరక్షరాస్యత వంటివి వారి వెనుకబాటుకు కారణమైనవని గతం తెలుపుతుంది.
దశాబ్దాల కాలం తర్వాత మహిళలు చైతన్యమై సమాజంలో ముందుకు వెళ్తున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ వారికి తోడ్పాటు అందిస్తే రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతి సాధిస్తారు. ఒక్కప్పుడు మహిళ అంటే వంట గదికే పరిమితం అనే ఆంక్షలను తెంచుకుని నేడు దేశాభివృద్ధిలో మహిళలదే పైచెయ్యిగా ఉంది. మహిళ అంటే ఒక శక్తిగా భావిస్తూ మహిళా బిల్లుకు జనమంతా జాగృతమై మద్దతు తెలుపుదాం. మహిళల పురోగతికి కృషి చేసిన మహనీయులైన కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, రాజారామోన్ రాయ్, జ్యోతిరావు ఫూలే వంటివారి ఆశయాలను గౌరవిస్తూ మహిళ సంక్షేమ, అభివృద్ధి చైతన్యాన్ని కాంక్షిస్తూ మహిళా బిల్లుకై ఏకమై ఉద్యమిద్దాం. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడిన వీరవనితలు ఝాన్సీ లక్ష్మిబాయ్, సరోజిని నాయుడు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ వంటి వారి త్యాగాలను యాదికి చేసుకుంటూ, స్త్రీ జనోద్ధారణకు కృషి చేసిన సావిత్రీ బాయ్ ఫూలే, తెగువకు ఐల్లమ్మ, పౌరుషానికి రాణి రుద్రమదేవి నేటికి ఆదర్శప్రాయులు వారి స్ఫూర్తితో మహిళలు సంఘటితం కావాలి, మహిళా బిల్లుకు ఏకమై గళమెత్తాలి.
మిద్దె సురేష్
97012 09355



