సెప్టెంబర్ 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాల ప్రత్యేక భేటీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడంతో గత 12 ఏళ్లలో మొదటిసారిగా పార్లమెంట్‌లో ఈ ప్రభుత్వం అనూహ్యమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. బహుశా గత మూడున్నర దశాబ్దాలలో మొదటిసారిగా ఓ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఓటమికి గురయింది. అయితే ఈ బిల్లు ఓటమితో ప్రతిపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’ అంటూ వెంటనే ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని మోడీ, ఇతర నాయకులు దిగడం మినహా అందుకు దారితీసిన కారణాల గురించి ఆత్మపరిశీలన చేసుకొనే ప్రయత్నం చేయడం లేదు. తమకు మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని తెలిసి కూడా, ముందుగా ఎటువంటి సంప్రదింపులు, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొనే ప్రయత్నం చేయకుండా కీలకమైన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా ఈ బిల్లులను ఎందుకు తీసుకు వచ్చారో ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకనే ఈ ప్రభుత్వం ఎవ్వరి విశ్వాసాన్ని పొందలేకపోతున్నది. చివరకు బిజెపి నేతలు సైతం ప్రభుత్వ ధోరణిని అర్ధం చేసుకోలేకపోతున్నారు.

మెజారిటీ లేనప్పుడు పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపి, ఇతర పక్షాల మద్దతు కూడదీసుకుని ప్రయత్నం చేయవచ్చు గదా? అనే ప్రశ్నలు ఆ పార్టీ నాయకులతోనే తలెత్తుతున్నాయి. ‘బిజెపి 11ఏళ్లుగా అధికారంలో ఉన్న మా అనుభవంలో, ఒక మహిళను ప్రధానమంత్రిగా నియమిస్తామని బిజెపి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా కూడా, మేము వారిని నమ్మము’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విశ్వాస రాహిత్యాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ప్రతి రాష్ట్రానికి సీట్ల సంఖ్యను 50 శాతం పెంచేందుకు అధికారిక సవరణ తీసుకు రావడానికి వీలుగా సభా కార్యకలాపాలను గంటసేపు నిలిపివేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదనకు, లోక్‌సభ చర్చ సందర్భంగా అఖిలేష్ ఇచ్చిన ఈ పదునైన సమాధానం, ప్రస్తుత రాజకీయాల స్థితిని స్పష్టం చేస్తుంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యవస్థను కొనసాగించడంలో సహకరించే పార్లమెంటరీ సంప్రదాయాలలో కీలకమైన ‘సంప్రదింపులు’ ప్రక్రియకు ఈ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలివ్వడంతో ఈ సమస్య ఏర్పడింది. 1991లో పివి నరసింహారావు ప్రధాని కాగానే నాటి ఆర్థిక దుస్థితిని తట్టుకునేందుకు రూపాయి విలువ తగ్గించాలని, అందుకోసం వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయమని ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కోరారు.

కానీ ప్రధాని మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సీనియర్లు అందరూ అందుకు వ్యతిరేకిస్తారని చెబుతూ తనకు కొంత సమయం ఇస్తే పరిష్కారం ఆలోచిస్తానని చెప్పి పంపారు. ఓ గంట తర్వాత రూపాయి విలువ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయమని మన్మోహన్ సింగ్‌ను ఆదేశించారు. ఓ గంటలో ఏ అద్భుతం జరిగిందో తెలియక ఆయన తికమక చెందారు. విచారించగా, వెంటనే పివి నరసింహారావు నాటి ప్రతిపక్ష నాయకుడు వాజ్‌పేయీకి ఫోన్ చేసి ఈ విషయమై చర్చించి, ఆయన సహకారం కోరారు. అందుకు ఆయన ఆమోదం తెలపడంతో ప్రతిపక్షం నోరువిప్పకపోతే ఇక అభ్యంతరం ఎవ్వరు చెబుతారు? అంటూ నాటి ప్రభుత్వం ముందుకుపోయింది.

వాజ్‌పేయీ ప్రభుత్వంలో సైతం కీలక అంశాలపై పార్లమెంట్‌లో బిల్లులు తీసుకువచ్చే ముందు స్వయంగా ప్రధాని, సీనియర్ మంత్రులైన అద్వానీ, జశ్వంత్ సింగ్, జార్జ్ ఫెర్నాండెస్ వంటి వారు ప్రణబ్ ముఖర్జీ వంటి ప్రతిపక్ష ప్రముఖులతో సవివరమైన సమాలోచనలు జరిపేవారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సైతం ప్రధాని లేదా సీనియర్ మంత్రులు ప్రతిపక్ష నేతలతో తరచూ సమాలోచనలు జరిపేవారు. లేదా సాంకేతిక అంశాలైతే సంబంధిత శాఖల ఉన్నతాధికారులను పంపి ప్రతిపక్ష నాయకులకు వివరించమనేవారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు, ప్రత్యేక సమయాలలో స్వయంగా ప్రధానులు అఖిలపక్ష సమావేశాలు జరిపేవారు. కానీ నరేంద్ర మోడీ ఈ సంప్రదాయాలు అన్నింటికీ తిలోదకాలిచ్చారు. ప్రతిపక్షాలతో మాత్రమే కాకుండా సొంత పార్టీలో సైతం ఎవ్వరితో సంప్రదింపులు జరపడం జరగడం లేదు.

స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖలు రాసారు. ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపవచ్చని, ఎన్నికల ప్రచారం మధ్యలో హడావుడిగా ఎందుకని ప్రశ్నించారు. ఈ బిల్లుల గురించి వివరణ ఇచ్చేందుకు అఖిలపక్ష సమావేశం జరపమని కోరారు. కానీ ప్రభుత్వం నుండి స్పందన లేదు. రాజ్యాంగ సవరణపై జరిగిన చర్చలో 103 మంది పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. వారంతా మహిళా రిజర్వేషన్ల అమలుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 2023లో ఆమోదించిన బిల్లును వెంటనే అమలు జరపమని అప్పుడే కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ, ఆ విషయాన్నీ నియోజకవర్గాల పునర్విభజన, జనగణనతో కలపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం లేదు. అంటే ప్రభుత్వానికి రహస్య అజెండా ఉందని అనుమానించాల్సి వచ్చింది.

ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల సంఖ్య పెంచుతామని హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగంలో చెప్పడమే గాని, ఆ మేరకు బిల్లుల్లో ఎక్కడా లేదు. ఈ విషయాన్నీ చివరకు స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రశ్నించగా, ఓ గంటసేపు సమావేశానికి విరామం ఇస్తే, బిల్లులో మార్పులు చేస్తానని అమిత్ షా చెప్పడం చూస్తుంటే అవసరమైన కసరత్తు లేకుండా, రాజకీయ ప్రయోజనాలకోసం ఈ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారని అభిప్రాయం బలపడుతుంది. పైగా, లోక్‌సభలో ఓ రోజంతా చర్చించిన తర్వాత, ఆ రాత్రికి హడావుడిగా 2023లో ఆమోదించిన బిల్లును వెంటనే అమలులోకి తెస్తూ రాష్ట్రపతి ఉత్తరువు జారీచేయడం గమనిస్తే పార్లమెంటరీ వ్యవస్థపట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనతగా వ్యవహరిస్తుందో వెల్లడి అవుతుంది. అవసరమైన కసరత్తు చేయలేకపోవడంతో రాజ్యాంగ సవరణకు తగు మద్దతు పొందటంలో విఫలమైన ప్రభుత్వం ప్రతిపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’గా చిత్రీకరిస్తూ ఓ భారీ ప్రచారాన్ని చేపట్టడం ప్రభుత్వ ఉద్దేశాలను బహిర్గతం చేస్తుంది.

యుద్ధాలలో, తీవ్రవాదుల దాడులలో, మావోయిస్టుల ఆపరేషన్‌లలో మహిళలను ‘రక్షణ కవచం’గా ఏర్పాటు చేసుకొని, హింసాయుత దాడులకు పాల్పడుతూ ఉండటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. అటువంటి దాడులను ‘పిరికితనంతో పాల్పడే చర్య’గా భావిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రభుత్వ ధోరణి సైతం అందుకు భిన్నంగా లేదు. అందుకనే దేశసమాఖ్య సమతుల్యతను దెబ్బతీసేందుకు మహిళలను రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకొనే, నియోజకవర్గాల పునర్విభజనకు పాల్పడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పుడు, మరో పదేళ్ల వరకు అమలు సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అకస్మాత్తుగా అమలుకు పూనుకోవడం, అర్ధాంతరంగా పార్లమెంట్ సమావేశాలు జరపడం గమనిస్తుంటే నిగూఢమైన ఎత్తుగడ ఉందని స్పష్టం అవుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి దారితీసిన సంఘటనల క్రమం గమనిస్తే ఈ ప్రభుత్వం పట్ల డిఎంకె, ఇతర ప్రతిపక్షాలలో అవిశ్వాసం ఎందుకు పెరిగిందో స్పష్టం అవుతుంది.

మార్చి 22న, బడ్జెట్ సమావేశాల మధ్యలో, 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసే మార్గాలపై చర్చించడానికి అమిత్ షా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా, చిన్న చిన్న బృందాలుగా పిలిచారు. అనేక ప్రధాన పార్టీలు షా సమావేశానికి హాజరుకాకుండా, అఖిలపక్ష సమావేశాన్ని కోరాయి. సమావేశానికి హాజరైన పార్టీలు ఆయన మాటలు విన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ముగిసే ఏప్రిల్ 29 తర్వాత ఈ చర్చను నిర్వహించవచ్చని చెబుతూ, మరింత వివరంగా చర్చించాలని కోరాయి. అయినప్పటికీ, ప్రభుత్వం ముందుకు వెళ్లి ఏప్రిల్ 16- 18 సమావేశాలను ప్రకటించింది. ఈ వారం ప్రారంభంలో పంపిణీ చేసిన ముసాయిదా బిల్లులలో, కేవలం మహిళలకు సాధికారత కల్పించడం కాకుండా, దేశ ‘రాజ్యాంగ స్వరూపాన్ని’ మార్చే ప్రయత్నం ఉందని ప్రతిపక్షం భావించింది. జాతీయ రాజకీయ వేదికపై బిజెపి ఒక ఆధిపత్యశక్తిగా అవతరించినప్పటి నుండి చూస్తే, మొదటిసారి ప్రతిపక్షాలు అత్యంత ఐక్యతను ప్రదర్శించినట్లు కనిపిస్తున్నాయి.

దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న బిజెపికి, అది అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ శాసనపరమైన ఓటమిని రుచి చూపించారు. గతంలో మాదిరిగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను చూపి భయపెట్టడం ద్వారా ప్రతిపక్షాలలో చీలిక తీసుకువచ్చే ప్రయత్నాలు ఫలించలేదు. టిఎంసి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపిలు ఓటింగ్ లో పాల్గొనకుండా చేసేందుకు ఆయా పార్టీలలో కీలకమైన నేతలపై ఒత్తిడులు తెచ్చిన్నట్లు తెలిసింది. అందుకనే మొదటిరోజు కనీసం ఏడుగురు టిఎంసి ఎంపిలు సభకు హాజరుకాలేదు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేరుగా ఆయా నాయకులకు ఫోన్ చేసి, వారంతా ఓటింగ్‌లో పాల్గొనేటట్లు చేయగలిగారు. ఈ బిల్లులను తిరస్కరించడంలో ప్రతిపక్ష పార్టీలు అందరూ తమ తమ రాష్ట్రాలలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకుండా విశాల జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి వ్యవహరించడం అత్యంత ప్రశంసనీయమైన పరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీకి మాత్రం అపారమైన ప్రశంసలు లభించాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఉత్తరప్రదేశ్ అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ చర్యలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలకు ఆ పార్టీకి చెందిన 37 మంది ఎంపిలు అందరూ సంపూర్ణ మద్దతు తెలపడం గమనార్హం. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఓ ప్రాంతీయ పార్టీ వ్యవహరించిన తీరు ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతీయ పార్టీలకు చెంపపెట్టు కాగలదు. 


చలసాని నరేంద్ర

98495 69050