
న్యూఢిల్లీ: ఈ 20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని, దీని అమలును ఆపాలంటే భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి వచ్చి పోరాడాలని ఆప్ ఆద్మీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ 20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా సేకరించిన దాదాపు 2.30 లక్షల వినతి పత్రాలతో మంగళవారం ప్రధాని మోడీ నివాసం వైపు మార్చ్‌గా బయలుదేరిన తరువాత పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో ఫిరోజ్ షా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ20 ఇంధనం వద్దనుకుంటే భారీ ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడాలన్నారు. గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న తమ ఎమ్‌ఎల్‌ఎలు ఈ 20 విధానాన్ని ప్రశ్నిస్తారని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ ఎంపి సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఈ విధానాన్ని ప్రస్తావించగా అమలు చేస్తామని కేంద్రం వెల్లడించిందన్నారు. ఈ విధానం భారత రైతులకు కాకుండా అమెరికా రైతులకే ఎక్కువగా లాభం చేకూరుతుందన్నారు. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి నిలదొక్కుకుని అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతులు నిలిపివేసి భారత రైతుల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.








