
పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు న్యాయ సేవల ప్రాధికా సంస్థ(టిఎస్ ఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన రెండవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనుంది. ఈమేరకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, టిఎస్‌ఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. శ్యామ్ కోషి గురువారం ఏర్పాట్లపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ పి శ్యామ్ కోషి అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ లోక్ అదాలత్‌ను సమర్థంగా నిర్వహించాలని జస్టిస్ కోషి అధికారులకు సూచించారు. న్యాయవ్యవస్థ, పోలీసు, ప్రాసిక్యూషన్, న్యాయ సేవల సంస్థల మధ్య సమన్వయం ద్వారా రాజీకి అనుకూలమైన కేసులను గుర్తించి లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా రిఫర్ చేయాలని చెప్పారు.
ఆగస్టులో సుప్రీంకోర్టు సమాధాన్ సమారోహ్
సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల కోసం ఆగస్టు 21 నుంచి 23 ఆగస్టు వరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ సమాధాన్ సమారోహ్- నిర్వహించనున్నట్లు తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్, సమాధాన్ సమారోహ్ రెండింటినీ విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి అందరు కృషి చేయాలని జస్టిస్ కోషి పిలుపునిచ్చారు. జూన్ 20 లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం, మద్దతు అందిస్తామని డిజిపి ఆనంద్, ఇతర పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ప్రాసిక్యూషన్ డైరెక్టర్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, అన్ని జిల్లాల ప్రధాన జిల్లా న్యాయమూర్తులు- ఛైర్‌పర్సన్లు, డిఎల్‌ఎస్‌ఏల కార్యదర్శులు, తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీల ఛైర్‌పర్సన్లు, టిఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్య కార్యదర్శి సిహెచ్. పంచాక్షరి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకట మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.












