
హెచ్-1బీ వీసా లాటరీకి సంబంధించి అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖ (యుఎస్‌సిఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి రెండో లాటరీ ఉండదని స్పష్టం చేసింది. ఈసారి కోటాకు సరిపడా హెచ్-1బి పిటిషన్లు ఇప్పటికే అందాయని తెలిపింది. ప్రతి సంవత్సరం 65 వేల సాధారణ హెచ్ -1బి వీసాలతో పాటు అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపు కింద మరో 20 వేల హెచ్-1బి వీసాలు జారీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ కోటాకు సరిపడా పిటిషన్లు అందాయని యుఎస్‌సిఐఎస్ తాజాగా పేర్కొంది.ఈ సంవత్సరం తొలిసారిగా వేతన ఆధారిత విధానంలో లాటరీ నిర్వహించారు. గతంతో పోలిస్తే ఈసారి వీసా రిజిస్ట్రేషన్లు తగ్గాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో 343,981 హెచ్-1బి రిజిస్ట్రేషన్లు రాగా 2027 ఆర్థిక సంవత్సరానికి 211,600 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. దీంతో, ఈసారి అదనపు లాటరీల అవసరం ఉండవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే, అంచనాలకు భిన్నంగా రెండో లాటరీ ఉండదని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.











