మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని రాయదుర్గంలో ప్రతిపాదించిన పీఎం ఏక్తా (యూనిటీ) మాల్ టెండర్లలో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, భారీ కుంభకోణం జరిగిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. యూనిటీ మాల్ టెండర్లలో కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమమైన, అనుమానాస్పద నిబంధనలు పెట్టీ, ప్రజా వనరులను తాకట్టు పెట్టి ప్రైవేటు డెవలపర్‌కు విపరీతమైన లబ్ధి చేకూరుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కెటిఆర్ లేఖ రాశారు. ప్రాజెక్టుపై ఎటువంటి తుది నిర్ణయాలు తీసుకోకముందే, ప్రైవేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లే కేంద్ర నిధుల విడుదలను తక్షణమే నిలిపివేయాలని, మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

భూమి విలువ కాకుండా, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.2,059.81 కోట్లు అని, దీనిలో భారీ అక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుందని కెటిఆర్ లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.202 కోట్ల కేంద్ర సహాయం మంజూరైందని తెలిపారు. రాయదుర్గ్‌లోని అత్యంత విలువైన 6.30 ఎకరాల స్థలంలో, సుమారు 27 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఈ ప్రాజెక్టును తలపెట్టారని అన్నారు. ఈ టెండర్‌లో కమర్షియల్ స్థలం కేటాయింపు తీవ్ర అనుమానాలకు తావిస్తోందని ఆక్షేపించారు. ప్రాజెక్టులో ప్రభుత్వానికి దక్కే కనీస వాటా కేవలం 9 లక్షల చదరపు అడుగులు కాగా, ప్రైవేటు డెవలపర్‌కు మాత్రం కనీసం 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారని అన్నారు.

అంటే, విలువైన ప్రజా భూమిని, భారీ ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ ప్రైవేటు డెవలపర్‌కు ప్రభుత్వం కంటే కనీసం రెట్టింపు స్థలాన్ని కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఎంపిక చేసిన డెవలపర్ కన్సార్టియంలో వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మెంబర్‌గా, అపర్ణ ఇన్‌ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామిగా ఉన్నాయని వివరించారు. టెండర్ మూల్యాంకనం ప్రకారం.. ఈ కన్సార్టియం ప్రభుత్వానికి లభించే కనీస వాటా కంటే అదనంగా 18,000 చదరపు అడుగుల గ్రేడ్- ఎ కమర్షియల్ స్థలాన్ని ఇచ్చేందుకు ప్రతిపాదించిందని, దీంతో ప్రభుత్వానికి దక్కే మొత్తం నిర్మిత ప్రాంతం 9.18 లక్షల చదరపు అడుగులకు చేరుతుందని తెలిపారు. అయితే, ప్రైవేటు డెవలపర్‌కు మాత్రం కనీసం 18 లక్షల చదరపు అడుగుల స్థలంతో పాటు, భవిష్యత్తు ప్రణాళికలు లేదా పర్మిసబుల్ ఎఫ్‌ఎస్‌ఐ ద్వారా వచ్చే అదనపు ప్రాంతాన్ని కూడా పొందే హక్కును కల్పించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి

ఖరీదైన ప్రభుత్వ భూమి, కేంద్ర నిధులు మంజూరవుతున్న ప్రాజెక్టులో ప్రైవేటు డెవలపర్‌కు ఇంత భారీ మొత్తంలో కమర్షియల్ హక్కులు ఎందుకు కల్పిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కేటాయిస్తున్న ప్రజా వనరులకు తగిన విలువ తెలంగాణ ప్రజలకు దక్కుతోందా.. లేదా..? అని ప్రశ్నించారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్‌ఎఎస్‌సిఐ) పథకం కింద పీఎం యూనిటీ మాల్ కోసం మంజూరైన రూ.200 కోట్ల వడ్డీ లేని రుణాన్ని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిజిటిపిసి) ద్వారా సదరు డెవలపర్‌కు నిధులు మళ్లించేలా టెండర్ నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ప్రజాధనాన్ని కేటాయించే ముందు ఈ ఆర్థిక నమూనాపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానాస్పద టెండర్లను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సహాయాన్ని లేదా పీఎం ఏక్తా మాల్ అనే బ్రాండ్ పేరును కవచంగా వాడుకుంటున్నదని పేర్కొన్నారు. ఒక ప్రతిష్టాత్మకమైన పేరు ఉన్నంత మాత్రాన ఒక అవినీతి ఒప్పందం పారదర్శకంగా మారిపోదని వ్యాఖ్యానించారు.

ప్రజా భూమి, ప్రజాధనం, విలువైన కమర్షియల్ హక్కులు ఉన్నచోట పరిపూర్ణమైన పారదర్శకత, స్వతంత్ర విచారణ ఉండి తీరాలని స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, అవినీతిపై స్వయంగా ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ, బీఆర్‌ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు, సందేహాలకు తావిస్తోందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అమృత్ టెండర్ల అక్రమాలు, బొగ్గు కుంభకోణం వంటి అనేక అవినీతి వ్యవహారాలపై ఆధారాలతో సహా సదరు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, స్వతంత్ర విచారణలు జరిపించాలని బిఆర్‌ఎస్ వరుసగా పోరాడుతోందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పీఎం ఏక్తా మాల్ టెండర్లలో వెలుగుచూసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు ఇందులో ఉన్నందున, ప్రజాధనం దుర్వినియోగం కాకముందే, ఉపసంహరించుకోలేని నిర్ణయాలు తీసుకోకముందే కేంద్ర ఆర్థిక శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం ఉన్న టెండరును వెంటనే రద్దు చేయాలని, ఈ లావాదేవీపై సమగ్రమైన స్వతంత్ర విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి కేంద్ర నిధులను విడుదల చేయవద్దని అన్నారు. ఈ విచారణను ప్రాజెక్టును రూపకల్పన చేసి, అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికే పరిమితం చేయకూడదని, కాగ్(సిఎజి)తో పాటు అర్హత కలిగిన ఆడిట్, విజిల్స్, విచారణ సంస్థల ద్వారా స్వతంత్ర తనిఖీ జరిపించి, వాస్తవాలను తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలువైన ప్రజా భూమి, కేంద్ర నిధులతో కూడిన ఈ టెండర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాధనం, ప్రజా ఆస్తుల దుర్వినియోగం చేస్తున్న ప్రతి సందర్భంలోనూ అందుబాటులో ఉన్న ఆధారాలను అధికారుల ముందు ఉంచి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టే వరకు బిఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కెటిఆర్ స్పష్టం చేశారు.