
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి వరుణయాగంలో పాల్గొంటే బిఆర్ఎస్ నేతలు డ్రామాలు అంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. గత రెండెళ్లు సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, పంటలు బాగా పండాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సిఎంగా ఉన్నప్పుడు మాజీ సిఎం కెసిఆర్ అనేక యాగాలు చేశారని, కెసిఆర్ చేసిన అయుత చండీయాగానికి చంద్రబాబు నాయుడు కూడా వచ్చారని ఆది శ్రీనివాస్ తెలియజేశారు. కెసిఆర్ చేసిన యాగాలపై తామెప్పుడు తప్పుగా మాట్లాడలేదని అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమేనని, ఎల్ నినో ప్రభావం తగ్గి వర్షాలు కురవాలని యాగం చేశామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలంటూ బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిలువ చేయొద్దని ఎన్డిఎస్ ఎ చెప్పిందని అన్నారు. మూడు బ్యారేజీల్లో నీళ్లు నిలువ చేస్తే మొత్తానికే నష్టమని ఎన్డిఎస్ ఎ చెప్పిందని, మేడిగడ్డతో పనిలేకుండానే ఎల్లంపల్లి, ఎల్ ఎండిలోకి నీళ్లు వచ్చాయని, ప్రాజెక్టుల గురించి హరీశ్ రావు తమకు పాఠాలు చెప్పక్కర్లేదని సూచించారు. హరీశ్ రావు చర్యల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని, అందుకే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా కొన్నాళ్లు కెసిఆర్ పక్కకు పెట్టారని ఆది శ్రీనివాస్ విమర్శించారు.











