
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి గెలిచాక ఎగనామాలు పెట్టారని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి వెళ్లి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని మరి ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వారికి వచ్చే బెనిఫిట్స్ అన్ని అందివాలని కోర్టు తీర్పు ఇచ్చిన రేవంత్ రెడ్డి కోర్టు తీర్పును బేకారత్ చేశారని మండిపడ్డారు.
తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లను పెట్టి బస్సులు నడపడం వల్ల ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని తెలిపారు. లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా డ్రైవర్లు ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలిపారు. హైదరాబాదులో ఆర్టీసీ ని ప్రైవేటీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా వద్దు కానీ ఆర్టీసీ భవన్ మాత్రం ప్రభుత్వంలో తీసుకుంటాను అనడం విడ్డూరమని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి లాంటి మేధావులు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రెండున్నర ఏళ్లుగా ఆర్టీసీ కార్మికులు ఓపికతో ఎదురుచూసి సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీకి పెను ప్రమాదం ముంచుకొస్తుందని ఇప్పటికే కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ వరంగల్ హైదరాబాద్ లాంటి నగరాలలో తీసుకొచ్చారని
ఇది అక్కడికి ఆగిపోకుండా రాష్ట్ర మొత్తం విస్తరిస్తుందని దీనివల్ల ఆర్టీసీ ప్రైవేటీకరణ అవడం ఖాయమని తెలిపారు. మహాలక్ష్మి పేరు మీద 9200 కోట్ల ఆదాయం వచ్చిందని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ సొమ్ము ఆర్టీసీ కార్మికులకు ఇవ్వకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం అతి త్వరలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ నక్క మల్లేశం, కన్వీనర్ బిఎస్ గౌడ్, కార్యదర్శి రవీందర్ గౌడ్, కె ఎస్ నారాయణ, పరశురాములు, అనంతరెడ్డి, హేమలత, కళావతి, బిఆర్ఎస్ నాయకులు కడవెరుగు రాజనర్సు, పాల సాయిరాం, రెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, రజనీకాంత్, కెమ్మాసారం శ్రవణ్ కుమార్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.













