ఎన్‌టిఎ ఇంకా బుద్ధి రానట్లే ..అదే పాత తంతు

కేంద్రం , ఎన్‌టిఎ, సిబిఐలకు సమన్లు

గురువారంలోగా వివరణకు గడువు

పర్యవేక్షక కమిటీ చెప్పినా మీరు మారరా?

న్యూఢిల్లీ : నీట్ యుజి పరీక్ష పత్రాల లీక్ అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా స్పందించింది. అత్యంత కీలక పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో ఉన్న ఎన్‌టిఎ ఇప్పటికీ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. చాలా సాదాసీదాగా వ్యవహరిస్తోందని అత్యున్నత న్యాయస్థానం మందలించింది. లక్షలాది మంది విద్యార్థుల భవితకు ఎన్నిసార్లు పరీక్షలు పెడుతారు? మీ పద్ధతి బాగాలేదని ఎన్‌ఎటిని కడిగిపారేసిన సుప్రీంకోర్టు ఈ విషయంపై కేంద్రానికి, ఎన్‌టిఎకు సిబిఐకి సమన్లు పంపించింది. ఎన్‌టిఎను రద్దు చేసి, ఈ వ్యవస్థ స్థానంలో సమగ్ర కట్టుదిట్టమైన , స్వయంప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటు కావాలి. ఈ సంస్థ ద్వారానే మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది.

ఈ పిటిషన్‌పై కేంద్రం, ఎన్‌టిఎ, సిబిఐలు సమాధానం ఇచ్చుకోవాలని న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇతరులతో పాటు పిటిషన్ ప్రతులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అందించాలని తెలిపింది. ఎన్‌టిఎ ఇప్పుడు పరీక్షల బాధ్యతలలో ఉన్నందున గురువారం నాటికి తగు వివరణలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించుకోవాల్సి ఉంటుంది. 2024లో కోర్టు వెలువరించిన ఆదేశాల పాటింపుపై తెలియచేసుకోవాలని తెలిపింది. రెండేళ్లు అయి ఉంటుంది. ఇంతకు ముందు పనితీరు మెరుగుపర్చుకోవల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పుడు కూడా ఎన్‌టిఎ గుణపాఠాలు నేర్చుకున్నట్లు లేదని ధర్మాసనం చురకలు పెట్టింది.

ఇస్రో ఛైర్మన్ కమిటీకి సూచనలు

ఇంతకు ముందు కూడా వ్యవహారం కోర్టుకు వచ్చింది. ఓ కమిటీ ఏర్పాటు అయింది. పర్యవేక్షక కమిటీ పలు సూచనలు వెలువరించింది. వీటిని ఆమోదించారు. అయితే ఇప్పుడు జరుగుతున్నదేమిటీ? అన్ని సవివరంగా ఎన్‌టిఎ తెలియచేయాల్సి ఉందని ధర్మాసనం తమ తాఖీదుల్లో తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ ( ఫైమా) దాఖలు చేసిన పిటిషన్ లాయర్ తన్వీ దూబే ద్వారా సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇటువంటి కేసులన్నింటిని కలిపి విచారిస్తామని తెలిపింది. ్ల ఇస్రో మాజీ ఛైర్మన్ కె రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ వెంటనే రంగంలోకి దిగి, ఎన్‌టిఎ పనితీరును సమీక్షించి తమకు తెలియచేయాలని ఆదేశించారు. ఇంతకు ముందటి ఆదేశాలను అమలు చేస్తున్నారా? లేదా అనేది తెలియాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. శుక్రవారం తదుపరి విచారణ జరుగుతుంది. అప్పటిలోగా సంబంధిత మూడు పక్షాలూ తమ సమాధానాలు ఇచ్చుకోవల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 3న జరిగిన నీట్‌యుజి పరీక్ష పేపర్ లీకేజ్ ఆరోపణలతో , విద్యార్థుల ఆందోళనలతో ఈ నెల 12న రద్దు అయింది. జూన్‌లో తిరిగి పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పేపర్ లీక్ గురించి సిబిఐ దర్యాప్తు చేపట్టింది. పలువురు అరెస్టు అయ్యారు. నీట్ రద్దుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.