
న్యూఢిల్లీ : నీట్ -యూజీ ప్రశ్నపత్రం లీక్ సహా పలు వివాదాలతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని కీలక నియామకాలు చేపట్టింది. శుక్రవారంనాడు ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్‌ను నియమించింది. ఐపిఎస్ అధికారి రవి కుమార్ సింగ్, ఐఎఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్ విలను ఎన్‌టిఏ డైరెక్టర్లుగా నియమించారు.
2016 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అమిత్ సమ్దారియాను జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. వీరిలో ప్రసన్న వెంకటేశ్ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొత్తగా నియమితులైన ముగ్గురు అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి మూడు వారాల్లోగా తమ కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
నిర్ణీత గడువులోగా బాధ్యతలు చేపట్టకపోతే సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ నుంచి డీబార్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల ఎన్‌టీఏలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నాలుగు అంచెల ప్రశ్నపత్రాల తనిఖీ విధానం, సుమారు 600 మంది నిపుణులను తొలగించడం, కొత్తగా సబ్జెక్ట్ నిపుణులను నియమించడం వంటి పలు సంస్కరణలను చేపట్టనున్నట్లు వెల్లడించింది.











