
ఎసిబి వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో టిజి రెడ్కో డిఇ ముత్యం వెంకట రమణను ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు టిజి రెడ్కో డిఇ ఇంట్లో ఎసిబి అధికారులు బుధ వారం సోదాలు చేపట్టారు. మాదాపూర్‌లోని వెంకటరమణ ఇళ్లు సహా 15 ప్రాంతాల్లో 8 బృందాలతో ఎసిబి సోదాలు నిర్వహించింది. మాదాపూర్ లోని వెంకట రమణ ఇంటితో పాటు మరో 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు ఖమ్మంలోనూ ఎసిబి సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో అధికారుల కళ్లు చెదిరేలా భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. డిఇ ముత్యం వెంకటరమణ నివాసాల్లో పెద్ద మొత్తంలో నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు, డైమండ్స్, విలువైన కార్లు, బ్యాంకు లాకర్‌లో ఉన్న మొత్తాన్ని అధికారులు లెక్కిం చారు.
బహిరంగ మార్కెట్‌లో వందల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అవినీతి నిరోధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సోదా లలో స్థిర, చరాస్తి పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా నాలుగు రెసిడెన్షియ ల్ ప్లాట్లు, జీ ప్లస్ 3 కమర్షియల్ భవనా లు, ఆంజనేయనగర్ మూసాపేటలో జీ ప్లస్ 5 కమర్షియల్ బిల్డింగ్, ఖానాపేట్, గుట్టల బేగంపేట్‌లో నగదు పత్రాలు, గోల్డ్ అండ్ డైమం డ్ జ్యువెలరీ, విలాసవంతమైన ఖరీదైన చేతి గడియారాలు, 20కి పైగా విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. స్వాధీనం చేసుకున్న వాచీల మార్కెట్ విలువను అధికారులు ఆన్‌లైన్ ద్వారా పరిశీలిస్తున్నారు. వీటి అసలు ధర, కొనుగోలు వివరాలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇంట్లో వ్యవ సాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన పత్రాల ఆధారంగా భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
వెంకట రమణ భార్య స్వప్న పేరుపై నిర్మాణంలో ఉన్న 10 ప్లాట్లను గుర్తించామని ఎసిబి అధికారులు వివరిం చారు. ఆంజనేయనగర్ మూసాపేటలో ఈ నిర్మా ణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆమె పేరుతో ఒక నిర్మాణ సంస్థతో పాటు ఎంఎస్ ప్రైడ్ అనే వాణిజ్య సంస్థలు ఉన్నట్లు, వాటికి ఆమె స్వయంగా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఎసిబి గుర్తించింది. కియా, మహీం ద్రా, బెలినో కంపెనీ లకు చెందిన ఫోర్ వీలర్ వాహనాలు గుర్తిం చారు. సాంకే తిక పరిజ్ఞానం ఉపయోగించి బ్యాంకు ఖాతాలు, భూపత్రాలపై ఆరాతీశారు. డిఇ ఇంట్లో గుర్తించిన విలువైన ఫర్నీచర్,వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు భావిస్తున్నారు. ముత్యం వెంకట రమణ డిప్యూటేషన్‌పై రెడ్కోలో ఉన్నారని, ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నా యని ఎసిబి అధికారులు వెల్లడించారు. వెంకటరమణ గతంలోనూ ఎసిబికి చిక్కారు. 2019లో ముత్యం వెంకటరమణపై జరిగిన ఎసిబి ట్రాప్ కేసులో రూ.26 లక్షలు గుర్తించామని ఎసిబి అధికారులు వెల్లడించారు.











