
ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా జిహెచ్‌ఎంసి, ఖైరతాబాద్ సర్కిల్ జూనియర్ అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిహెచ్‌ఎంసి, ఖైరతాబాద్ జోన్, బోరబండ 37 సర్కిల్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో బి. శ్రీలత జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. బాధితుడు ఇంటి నిర్మాణానికి మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత బాధితుడు ఇంటి నిర్మాణ అనుమతి కోసం జూనియర్ అసిస్టెంట్‌ను సంప్రదించగా, రూ.5లక్షలు ఇస్తే అనుమతి ఇస్తామని చెప్పింది.
దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మొదటి విడతగా లక్ష రూపాయలు యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద బాధితుడు జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీలతకు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు జూనియర్ అసిస్టెంట్‌కు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు పంపించారు.











