హైదరాబాద్: యువతపై జరుగుతున్న దాడులు దారుణం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఉద్యమ పార్టీగా తమకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంని అన్నారు. ఇందిరాపార్కు దగ్గర బిఆర్ఎస్ వి నిరసనలు చేపట్టారు. నల్లచొక్కా ధరించి నిరసనలో కెటిఆర్ పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కెటిఆర్ నినాదాలు చేశారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీకతీతంగా యువత పోరాడుతున్నారని, యువతకు అండగా నిలబడేందుకే ఈ కార్యక్రమం అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం మాట్లాడాలని.. వారికి అండగా ఉండాలని నిరసన చేపడుతున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషమని, పిల్లలపై పోలీసులు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఢిల్లీ ఘటన చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయని, మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసిందని అన్నారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోడీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

రాజ్యమా ఉలికిపడు అని పిలుపునిచ్చారు. ఈ జనరేషన్ చావుకు భయపడే జనరేషన్ కాదని.. ఈ జనరేషన్ ఐటీ, ఇడి, సోదాలకు భయపడేవారు కాదని సూచించారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి..వచ్చాయా? మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చారని చురకలంటించారు. యువత జవాబుదారీ తనం కోరుతున్నారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, యువత మీద పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మోడీ మీద కొట్లాడితే, చోటాభాయ్ కు ఎందుకు కోపం వస్తుంది? అని ప్రశ్నించారు. సిఎంను నిద్రలేపి అడిగినా మాజీ సిఎం కెసిఆర్ అంటున్నారని, పేపర్ లీక్ కు తనకేం సంబంధం అని పిల్లలకు జరిగే అన్యాయం బిజెపి ఎంపిలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పేపర్ లీకుకు, తనకు సంబంధం ఉందని నిరూపించి ఇందిరాపార్కు దగ్గర ఉరితీయ్ అని అన్నారు. కెసిఆర్ కూడా యువతకోసం సరైన సమయంలో మాట్లాడుతారని, పరీక్షల మీద చర్చించే ప్రధాని, లీక్ లపై ఎందుకు చర్చించరని కెటిఆర్ నిలదీశారు.