
పిసిసి పనితీరుపై ఏఐసిసి సీరియస్
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం
మంత్రులకు, ఎంఎల్‌ఎలకు మధ్య అంతరం
‘సర్’ ఆశించిన విధంగా సాగడం లేదు
జెడ్‌పిటిసి, ఎంపిటిసి, ఐదు కార్పొరేషన్ల ఎన్నికలకు పార్టీ సమాయత్తం
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు కమిటీ
నామినేటెడ్ పదవులపైనా సమాలోచనలు
తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై చర్చించిన నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి పని తీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పలు జిల్లాల్లో మంత్రులకు-ఎమ్మెల్యేలకు మధ్య, ప్రభుత్వానికి-పార్టీకి మధ్య సమన్వయం కొరవడిందని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) ఆశించిన విధంగా జరగడం లేదని కాంగ్రెస్ పెద్దలు పెదవి విరిచారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం (ఇందిరా భవన్)లో బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు హాజరయ్యారు.
ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పాలన, పార్టీని సంస్థాగత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల కొన్ని కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసినందున, వాటిలో మూడు, నాలుగు మినహా మిగతా కార్పొరేషన్లకు కొత్త వారికే అవకాశం కల్పించాలన్న అంశంపైనా వారు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. కాగా, మీనాక్షి నటరాజన్ వరంగల్, నల్లగొండ తదితర జిల్లాలను ఉదహరిస్తూ మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య గొడవలెందుకు జరుగుతున్నాయి ?, ప్రభుత్వానికి-పార్టీకి మధ్య సమన్వయం ఉండడం లేదని, పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ ఆవరణకు వచ్చి నిరసనగా ధర్నాలు చేయడం ఏమిటీ ?, అదేమైనా వేదికా?, దీంతో ప్రజలకు ఏమి సందేశం పంపిస్తున్నారు?, వీటిని చూసి ప్రతిపక్షాల నేతలు సంబరపడరా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. తాను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు ఇటువంటి జరిగితే ఉపేక్షించనని, వీటికి పార్టీ అధిష్టానానికి తానే కదా సమాధానం చెప్పుకోవాల్సిందీ అని ఆమె కొంత కఠినంగానే మాట్లాడారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తాను కఠినంగా మాట్లాడానని మీకు అనిపించవచ్చు కానీ తాను ఎక్కడ ఇన్‌ఛార్జిగా ఉన్నా క్రమశిక్షణ గాఢి తప్పడం చూడలేదన్నారు.
క్షేత్ర స్థాయి నుంచి మరింత బలోపేతం
క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై విస్తృతంగా చర్చించారు. పార్టీ కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోనూ అత్యంత సమర్థవంతంగా అమలు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రజా సంక్షేమం ప్రజలకు చేరువ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంపైనా చర్చించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా, వాటిని సరైన విధంగా ప్రచారం చేసుకోవడం లేదన్న అంశంపై చర్చించారు. ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని, పాలనాపరమైన విజయాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించాలని సూచించారు. ప్ర భుత్వానికి, పార్టీ యంత్రాంగానికి మధ్య మెరుగైన సమన్వయాన్ని ఏ ర్పరచడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా కృషి చేయవచ్చని వారు అభిప్రాయపడ్డారని తెలిసింది. ప్రజా సేవే తమ లక్షమని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగేందుకు అందరూ కట్టుబడి ఉన్నామని సమావేశంలో పాల్గొన్న నాయకులు స్పష్టం చేశారని తెలిసింది.
ఎన్నికలపైనా దృష్టి: సీఎం
జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణ, హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకూ చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని తెలిసింది.
‘సర్’పై అప్రమత్తం: పిసిసి చీఫ్
ఇదిలాఉండగా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ‘సర్’పై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల మూడవ తేదీతో గడువు ముగియనున్నందున ఒక్క ఓటు కూడా నష్టపోవద్దని బిఎల్‌ఏలకు, పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ఇందులో జిల్లా, మండల కార్యవర్గ ప్రతినిధులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇంతకు మించి తాను పార్టీ అంతర్గత విషయాలపై సమాధానాలు చెప్పనని ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా దాట వేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపైనా చర్చ
అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికకు కమిటీ ఏర్పాటు చేయాలని, పిసిసి చీఫ్, సంబంధిత జిల్లా కమిటీలతో చర్చించి నివేదిక రూపొందిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం, ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెట్టడం వంటి అంశాలపైనే సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు. మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చించలేదని, ఇది వేదిక కాదని అన్నారు.
హైడ్రాపై సీఎందే తుది నిర్ణయం: ఉత్తమ్
హైడ్రా వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైడ్రా ముఖ్యమంత్రి పరిధిలోని శాఖకు సంబంధించిన అంశం కాబట్టి తాను మాట్లాడలేనని ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. హైడ్రాపై బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలు. విధానాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు.











