
గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై రోగి సహాయకురాలు దాడి చేయడంతో జూనియర్ డాక్టర్లు తనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. గాంధీ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకురాలు దాడిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ ఐఎంసీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యుడు శివశంకర్‌పై రోగి అటెండర్ మౌనిక మెర్లిన్ దాడికి పాల్పడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. రోగి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు చెప్తున్న సమయంలో మౌనిక మెర్లిన్ నిరంతరాయంగా వీడియో కాల్‌లో మాట్లాడుతుండటంతో డాక్టర్ ఆమెను వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తూ వైద్యుడిని ఫోన్‌లో చిత్రీకరించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వైద్యుడు ఆమె ఫోన్‌ను తీసుకుని డ్యూటీ సిస్టర్‌కు అప్పగించగా,
మరింత ఆగ్రహించిన మౌనిక మెర్లిన్ డాక్టర్ శివశంకర్‌పై చేతులతో దాడిచేసింది. ఘటనలో వైద్యుడి కళ్లజోడు పగిలిపోగా, నుదుటిపై గాయాలయ్యాయి. దీంతో వార్డులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు నిరసనగా సోమవారం ఉదయం జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి ఆసుపత్రి ప్రధాన భవనం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించాలని, ఆసుపత్రుల్లో సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.డీఎంఈ నరేందర్‌కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి, ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపి, నిందితురాలిపై కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం జూడాలు ఆందోళన విరమించారు. నిందితురాలిపై ‘మెడికేర్ సర్వీసెస్ యాక్ట్-2008’ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.











