గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్ల యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 8 నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. గిగ్, ప్లాట్‌ఫాం కార్మికుల సమస్యలపై శుక్రవారం సచివాలయంలో కార్మిక మంత్రి డా.జి.వివేక్ వెంకటస్వామి యూనియన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లు, సంక్షేమం, సామాజిక భద్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు వారి హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారని అన్నారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తోందని,

వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని చెప్పారని వారు వెల్లడించారు. చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే వరకు గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు, యూనియన్లు ఓపికగా ఉండాలని మంత్రి కోరారని తెలిపారు. కార్మికులకు మేలు జరిగేలా అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు వారు వెల్లడించారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో జరిగిన చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసి సమ్మె విరమించామని స్పష్టం చేశారు. తమ సమస్యలు, డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించడంతోపాటు వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలిపారు. గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం దానిని సమర్థంగా అమలు చేసి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్న ఆశాభావంతో ఉన్నామని యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్, రవాణా శాఖ అధికారులు, గిగ్, ప్లాట్‌ఫాం యూనియన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.