
ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ - 2026లోని తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియాల మధ్య క్రీడా భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఈ డిసెంబర్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మరో సిరీస్ కూడా భారత్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్ బర్గ్ వెల్లడించారు.
‘‘అన్ని ఆప్షన్లను పరిశీలించడానికి మేం సిద్ధంగా ఉండాలి. ఇసిబితోనే కాకుండా బిసిసిఐతో కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో మరింత క్రికెట్ వినోదాన్ని పంచే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి (భారత్‌లో యాషెస్) మేం ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికా సిద్ధం చేయనప్పటికీ.. భవిష్యత్తులో కచ్చితంగా పరిశీలించే అవకాశముంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్ట్ క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది. దీనిని మరింత బలోపేతం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అని టాడ్ గ్రీన్ బర్గ్ తెలిపారు.











