గ్లాస్గో: స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ రజతం గెలిచి నయా చరిత్ర సృష్టించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఈ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. ప్రతికూల వాతావరణంలోనూ గుల్వీర్ సింగ్ అసాధారణ పోరాట పటిమతో రేసును పూర్తి చేశాడు. సుదీర్ఘ దూరాన్ని గుల్వీర్ 27 నిమిషాలు 49.78 సెకన్లలో పూర్తి చేశాడు. ఒకవైపు జోరుగా వర్షం పడుతున్నా గుల్వీర్ తన పోరాటాన్ని కొనసాగించాడు. చివరి వరకు పోరాడుతూ రజతం సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా అథ్లెట్ రాబిన్సన్ స్వర్ణం సాధించగా, డేవిడ్ కాంస్యం గెలుచుకున్నాడు. కాగా, గుల్వీర్ సింగ్ కెనడా, ఉగాండా, జమైకా అథ్లెట్లను వెనక్కి నెట్టి ప్రతిష్ఠాత్మకమైన రజతం దక్కించు కోవడం విశేషం.