
న్యూఢిల్లీ: నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఎలాంటి శిక్షాత్మక లేదా ప్రతీకార చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే తన నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానని ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు ఆయన బుధవారం లేఖ రాశారు. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రిలో తనను పరామర్శించిన ఇద్దరు మంత్రు లు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించడం, పరీక్షల అవకతవకలపై పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చ నిర్వహించడం, అవసరమైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని కూడా పరిశీలించడం వంటి తన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిగణిస్తుందని హామీ ఇచ్చారని వాంగ్‌చుక్ తెలిపారు. అయితే ఉద్యమంలో పాల్గొన్న యువతపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని కోరారు. అలాంటి హామీ వస్తే ప్రభుత్వంతో చర్చలకు రావాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కూడా విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.
జూలై 20న జరిగిన చలో సంసద్ ర్యాలీలో పోలీసులు అతిగా బలప్రయోగం చేసినప్పటికీ నిరసనకారులు శాంతియుతంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువతను వేధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తన దీక్షను విరమించాలని వివిధ పార్టీలకు చెందిన సుమారు 65 మంది ఎంపీలు లేఖలు రాయడంతో పాటు పలువురు వ్యక్తిగతంగా కలిశారని చెప్పారు. తాను జీవించి విద్యార్థుల వద్దకు, విద్యారంగానికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నప్పటికీ, ఈ ఉద్యమానికి కారణమైన యువత ప్రయోజనాలను విస్మరించి అలా చేయలేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌కు చెందిన వివేక్ టంఖా, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితర ప్రతిపక్ష ఎంపీలు మెదాంతా ఆస్పత్రిలో వాంగ్‌చుక్‌ను కలిసి దీక్ష విరమించాలని కోరారు.
పరీక్షల సంస్కరణలు, విద్యారంగంలో జవాబుదారీతనం అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని, శాంతియుత నిరసనకారులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాగా, పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై జవాబుదారీతనం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా సోనం వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.











