
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటివి గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌కు కారణమవుతూ మహిళలను వేధిస్తోంది. గర్భాశయం కింది భాగంలో కణాల అసాధారణ పెరుగుదలను హెచ్‌పివి (హ్యూమన్ పాపిల్లోమా వైరస్)గా పిలుస్తారు. ఈ వైరస్‌వల్ల కలిగే ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టడానికి బాల్యదశలోనే వ్యాక్సినేషన్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే అత్యంత సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ ఈ క్యాన్సర్‌కు కారణమవుతోంది. ముఖద్వార క్యాన్సర్‌లో రెండు వందలకు పైగా రకాలున్నాయి. కొన్ని జననాంగంపై మొటిమలకు కారణమైతే, మరికొన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఈ క్యాన్సర్ నివారణకు 9 14 ఏళ్ల బాలికలకుహెచ్‌పివి వ్యాక్సినేషన్ అత్యవసరంగా మారింది. ఈ క్యాన్సర్ తలెత్తినప్పుడు యోనిద్వారా రక్తాస్రావం (పీరియడ్స్ మధ్యలో లేదా సంభోగం తర్వాత) జరుగుతుంది.
ప్రస్తుతం 90 95 % కేసులు హెచ్‌పివి ఇన్పెక్షన్ ద్వారా వస్తున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో దాదాపు నాలుగోవంతు మన దేశంలోనే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా కొత్తగా సుమారు 1.28 లక్షల మంది మహిళలు ఈ క్యాన్సర్ బారినపడుతుండగా, 77వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన రాష్ర్టం విషయానికొస్తే, ఏడాదికి సగటున 3,200 మంది ఈ క్యాన్సర్‌కు గురవుతుండగా, హైదరాబాద్‌లోని ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రికి రోజూ వస్తున్న వందలాది కేసుల్లో అత్యధికంగా సర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధించినవి. ప్రపంచ సగటు కన్నా మన దగ్గర సగటు ఎక్కువగా ఉండడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. గ్లోబకాన్ 2022 నివేదిక ప్రకారం దేశంలోని మహిళల్లో అతి ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో ఇది రెండవది. తొలిదశలో ఈ క్యాన్సర్‌ను గుర్తించలేకపోతుండడం వల్ల మరణాల రేటు అధికంగా ఉంటున్నాయి. వాస్తవానికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను సకాలంలో స్క్రీనింగ్ ద్వారా గుర్తించి వ్యాక్సినేషన్‌తో నివారించవచ్చు.
హెచ్‌పివి ద్వారా సోకే ఈ క్యాన్సర్, లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించే ఒక సాధారణ వైరస్. ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి 15 20 ఏళ్లు పడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే మహిళల్లో 5 10 ఏళ్లకే క్యాన్సర్ కణాలు వృద్ధిచెందుతాయి. గర్భనిరోధక మాత్రలు వినియోగించే వారిలో ఈ క్యాన్సర్ సోకే ప్రమాదముంది. ఈ క్యాన్సర్ వల్ల నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది. పొత్తి కడుపులో నొప్పి, కడుపులో ఉబ్బరం, పదే పదే మూత్ర విసర్జనతోపాటు మంటగా ఉండడం, మోనోపాజ్ తర్వాత, లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం కావడం, దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్, అలసట, నీరసం, బరువు తగ్గడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న వయస్సులో పెళ్లి, చిన్న వయస్సులోనే చురుగ్గా లైంగిక ప్రక్రియలో పాల్గొనడం, ఎక్కువమందితో లైంగిక ప్రక్రియలో పాల్గొనడం, జననేంద్రియ అపరిశుభ్రత, ధూమపానం, ఎక్కువసార్లు గర్భం దాల్చడం, ఎక్కువసార్లు అబార్షన్ కావడం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, పోషకాహార లోపం ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు.
వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే ‘పాప్ స్మియర్ టెస్ట్’ చేయించడంద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవచ్చు. అంతేకాకుండా 30 ఏళ్లు పైబడిన మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకుంటూ జాగ్రత్త పడుతుండాలి. ప్రారంభదశలో గుర్తించడం వల్ల ఈ క్యాన్సర్ బారినుంచి బయటపడే అవకాశముంటుంది. రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్. ఎక్కువ కాలం ఈ వైరస్‌ను గుర్తించి నివారించకపోతే మరణానికి దారితీస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లేదా బ్యాక్టీరియాను తట్టుకోవడానికి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి. కానీ హెచ్‌పివి వైరస్ విషయానికొస్తే శరీరం ఎలాంటి యాంటీబాడీస్‌ను తయారు చేయదు. కాబట్టి ఒకసారి ఇన్‌ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అలా ఎక్కువ రోజులు దాన్ని గుర్తించకపోతే సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది.
ఈ క్యాన్సర్‌ను నివారించడానికి బాలికలు వ్యాక్సిన్‌ను చేయించుకోవాలి. తొమ్మిదేళ్ల నుంచి పద్నాలుగేళ్లలోపు వారికి రెండు డోసులు... ఒక డోసు వేసిన ఆరు నెలల తర్వాత మరో డోసు తీసుకోవాలి. అలాగే 15 ఏళ్ల వయస్సు దాటిన ఆడపిల్లలకు ఆరు నెలల చొప్పున మూడు డోసులు వేయించాలి. ఈ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ల వయస్సులోనూ తీసుకోవచ్చు. పెళ్లికి ముందు వ్యాక్సిన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ వ్యాక్సిన్ మూలంగా గర్భాశయ క్యాన్సర్ రాకుండా 80% మేరకు అడ్డుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం 2030 నాటికి 90% మేరకు ఈ క్యాన్సర్‌ను మట్టుపెట్టడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.
2006లో అందుబాటులోకి వచ్చిన హెచ్‌పివి టీకా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్ల డోసులు పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్లు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా, వీటిలో 90 దేశాలు సింగిల్ డోసుగా అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులు సంఖ్యాపరంగా చైనా, అమెరికా తర్వాత మనదేశం మూడవ స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశముందని అంచనా. దీన్ని అరికట్టడానికి 9 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పివి టీకా వేయడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా మన రాష్ర్టంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో హెచ్‌పివి వ్యాక్సిన్‌ను బాలికలకు ఉచితంగా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి బాలికా సద్వినియోగం చేసుకుంటూ క్యాన్సర్ రహిత సమాజానికి తోడ్పడాలి.
-కోడం పవన్‌కుమార్
9848992825













