
మన తెలంగాణ/హనుమకొండ: ఉద్యోగులు, విద్యార్థుల ఆందోళనలో పాలుపంచుకోవడానికి హన్మకొండకు వచ్చిన బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావును అరెస్ట్ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కలెక్టరేట్ వద్ద జరిగిన ఉద్యోగుల మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపిన అనంతరం పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన హరీష్‌రావును సుబేదారి పోలీసులు అరెస్టు చేసి వాహనం ఎక్కించబోయారు. అయితే, అందు కు నిరాకరించిన హరీశ్‌రావు.. రోడ్డు వెంబడి నడుచుకుంటా స్టేషన్‌కు వెళ్లారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ మాజీ చీప్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉన్నారు. హరీష్‌రావు అరెస్ట్‌తో కొద్దిసేపు పోలీసులకు బిఆర్‌ఎస్ కార్యకర్తలకు తోపులాట జరిగింది. హరీశ్‌రావును అరెస్టు చేసే క్రమంలో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.
తోపులాటలో హరీష్‌రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెంటనే హరీష్‌రావును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ మంత్రి హరీష్‌రావును విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వి ద్యాశాఖ మంత్రిగా ఉండటం దౌర్భాగ్యమన్నారు. బిటెక్, పాలిటెక్నిక్ విద్యార్థులను ప్రభుత్వం అవమానపరుస్తోందని ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభు త్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్‌ఎస్ అమలు కావడంలేదని మండిపడ్డారు. గతం లో ఉద్యోగుల కోరిక మేరకు ఒక శాతం కాంట్రిబ్యూషన్‌తో ఈహెచ్‌ఎస్ పథకాన్ని తీసుకొచ్చామని.. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులను సంప్రదించకుండానే కాంట్రిబ్యూషన్‌ను ఒకటిన్నర శాతానికి పెంచిందని ఆరోపించారు. భారాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఇద్దరి జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ కట్ చేస్తున్నారని..
కుటుంబంలో రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నా వారి నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగుల జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకుంటున్న ప్రభుత్వం వారికి ఈహెచ్‌ఎస్ కింద క్యాష్‌లెస్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభు త్వం ఇప్పటి వరకు ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకోకపోవడంతో ఈహెచ్‌ఎస్ కింద వైద్యం అందించలేమని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉండటం, ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీలు గిట్టుబాటు కాకపోవడం వల్లే ఆసుపత్రులు ఈహెచ్‌ఎస్‌కు ముందుకు రావడం లేదని వివరించారు. పాత వైద్య రీయింబర్స్‌మెంట్, క్యాష్‌లెస్ చికిత్స విధానాలు నిలిచిపోవడం.. కొత్త ఈహెచ్‌ఎస్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఉద్యోగి కుటుంబ సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈహెచ్‌ఎస్ వర్తించదని చెప్పడంతో సుమారు రూ.11 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. చివరకు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు బిల్లు తగ్గించాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకుంటున్నప్పుడు వారికి వైద్య భద్రత ఎందుకు కల్పించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు తమకు అన్యా యం జరిగిందని పోరాడుతుంటే.. వారిపైన అక్ర మ కేసులు పెడుతూ భౌతికంగా వేధిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు కూడా మంత్రి అయినందుకు విద్యార్థి లోకమం తా రోధిస్తోందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలపమని ఎవరు అడిగారు.. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడమేనని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను రోల్ మాడల్‌గా తీసుకునే ముఖ్యమంత్రి అక్కడ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల నష్టపోయామని ఇప్పటికే బాధపడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇప్పటికైనా జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.








