
త్రివర్ణపతాకం దేశానికి గర్వకారణం, సూర్ఫినిచ్చే శక్తి
వికసిత్ భారత్ సంకల్పానికి కట్టుబడి ఉంటామని ప్రతిని చేద్దాం
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు
న్యూఢిల్లీ: భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ దేశ ప్రజలంతా ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారంనాడు పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణమని, దేశం కోసం ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా పనిచేసేందుకు నిరంతర సూర్ఫి అని అన్నారు.
ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేయాలని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని, వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టి సహకారం అందించేందుకు ప్రతినబూనాలని కోరారు. ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారానికి ఒక ప్రతేకత ఉందని తెలిపారు. వందేమాతర గేయం
150 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈసారి ఆగస్టు 6న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆగస్టు 9 నుంచి 17 వరకూ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇది మనందరికి గర్వకారణమని చెప్పారు.








