లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి సహా ఆలయాల్లో అమ్మవారికి పూజలు

బోనాలు సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం, టిపిసిసి మహేశ్‌కుమార్‌గౌడ్

భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు, బోనాలతో క్యూ కట్టిన మహిళలు

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బోనాల ఉత్సవాల చివరి ఆదివారం కావడంతో అమ్మవార్ల ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. అమ్మవార్ల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా చారిత్రాత్మక లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, శాలిబండ అక్కన్న మాదన్న మహంకాళి, గౌలిపుర మహంకాళి మాతేశ్వరి, మీర్ ఆలం మండిలోని మహాకాళేశ్వర దేవితో పాటు నగరంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, తదితర ఆలయాలను దర్శించుకున్నారు. లాల్‌దర్వాజ ఆలయానికి చేరుకున్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు అమ్మవార్లకు పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. పలు కార్పొరేషన్ల చైర్మన్‌లు మెట్టు సాయి కుమార్, సరితా తిరుపతయ్య యాదవ్, భాస్కర్, అజయ్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, పోలీస్ కమిషనర్ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.

భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

ఇదిలావుండగా బోనాల ఉత్సవాలు గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రతి చిన్న ఆలయంలో కూడా నిర్వహించడంతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అన్ని ఆలయాల వద్ద కోలాహలం కనిపించింది. గత నెల 16న గోల్కొండ కోటలో ప్రారంభమైన ఈ చారిత్రాత్మక వేడుకలు పాతబస్తీలోని లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో జరగడంతో ముగిశాయి. లాల్ దర్వాజ ఉత్సవాలతో నగరం అంతటా భక్తిపారవశ్యం నెలకొంది. ఆలయాలను రంగురంగుల దీపాలతో, అలంకరణలతో ఏర్పాటు చేసి ఆయా స్థానిక ప్రజలు బోనాలను సమర్పించుకున్నారు. తెల్లవారుజాము నుంచే నగరంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవార్లకు బోనాలు, ఒడి బియ్యం, చీర, సారె సమర్పించేందుకు వేలాదిగా మహిళలు ఆలయాలకు తరలివచ్చారు.

డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో నగరమంతటా ప్రత్యేక శోభ సంతరించుకుంది. దీనికితోడు ప్రతి రాజకీయ పార్టీ తరఫున ఆయా ప్రాంత నాయకులు బోనాల పండుగను పురస్కరించుకుని పెద్ద పెద్ద కటౌట్‌లు, బ్యానర్లు కట్టారు. ప్రతి ఆలయం వద్ద బోనాలను నెత్తిన ఎత్తుకుని మహిళలు క్యూ కట్టారు. వారందరికి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. రద్దీని నియంత్రించేందుకు ఆలయ కమిటీలు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు. ఉదయం 5 గంటల నుంచే బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆదివారం రాత్రి పదిన్నర వరకు భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం, చీర-సారె సమర్పించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం అమ్మవారి శాంతి కల్యాణ మహోత్సవంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. తర్వాత రోజు సోమవారం రంగం జరుగుతుంది.

పజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి: మంత్రి సురేఖ

రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. అమ్మవార్ల దయతో రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయాల్లో నిర్వహించిన వరుణయాగంతో ఎల్ నినో ప్రభావం తగ్గి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం సంతోషదాయకమని మంత్రి అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ, పోలీస్, జిహెచ్‌ఎంసి, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లనూ పకడ్బందీగా చేపట్టడంతో భక్తులు సంతోషంగా బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన బోనాల పండుగ సందడి కనిపిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ జాతర ఏర్పాట్ల పై పలువురు భక్తులతో మాట్లాడి వారి విశేష స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలు ఆనందంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు.

ఆధ్యాత్మిక, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు: మహేష్ కుమార్ గౌడ్

భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు భాగ్యనగరంలోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా ఆలయాలకు చేరుకున్న ఆయనకు ఆయా ఆలయాల అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.