మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో రజతం లభించింది. 69 కిలోల విభాగంలో స్టార్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా 227 కిలోల బరువును ఎత్తిన హర్జిందర్ కౌర్ వరుసగా రెండో కామన్వెల్త్ పతకాన్ని సొంతం చేసుకుంది. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోటీల్లో హర్జిందర్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. ఈసారిమరింత మెరుగైన ప్రతిభతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఈ విభాగంలో కెనడాకు చెందిన షార్లెట్ సిమోనో 235 కిలోల బరువును ఎత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. కాగా, రజతం సాధించిన తర్వాత హర్జిందర్ భావోద్వేగానికి గురైంది. దేశానికి వరుసగా రెండోసారి పతకం అందించడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ పతకాన్ని తన కుటుంబానికి అంకితం ఇస్తున్నట్టు పేర్కొంది. ఇదిలావుంటే కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన హర్జిందర్, గుల్వీర్ సింగ్‌లను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు అభినందించారు.