
మన తెలంగాణ/హైదరాబాద్: గత అసెంబ్లీ సమావేశాల వేళ తాను ప్రస్తావించిన హ్యామ్ రోడ్ల స్కామ్ ఇప్పుడు నిజమైందని బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల్లో 22 నుంచి 25 శాతం వరకు ఎక్సెస్ టెండర్లు వచ్చాయని ఆరోపించారు. ఆర్ అండ్ బి శాఖలో రూ.11 వేల కోట్ల టెండర్లకు దాదాపు రూ.15 వేల కోట్ల వరకు వ్యయం పెరిగిందని, పంచాయతీ రాజ్ శాఖలో రూ.6 వేల కోట్ల టెండర్లు రూ.8 వేల కోట్లకు చేరుతున్నాయని విమర్శించారు. ఎక్సెస్ టెండర్ వల్ల ప్రభుత్వంపై 5 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పా రు. ఈ రెండు శాఖలలో కలిపి వేల కోట్ల రూ పాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతోందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మాజీ మంత్రి హరీష్‌రావు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడా రు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టిన పలు టెండర్లపై బిఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ రహదారుల టెండ ర్లు తగ్గింపుతో (లెస్) జరిగితే.. రాష్ట్ర రహదారు ల టెండర్లు మాత్రం ఎక్సెస్‌కు వెళ్తున్నాయని మండిపడ్డారు. టెండర్లలో 40 శాతం రాష్ట్ర ఖ జానా నుంచి వెళ్తే మిగిలిన 60 శాతం కాంట్రాక్టర్లు బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకుంటారని తెలిపారు. ఈ రుణాలను 15 సంవత్సరాల పాటు చెల్లించాల్సి
ఉంటుందని వివరించారు. అయితే, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం సావరిన్ గ్యారెంటీ ఇస్తోందని, ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలపై తీవ్రమైన భారంతో పాటు రాబోయే ప్రభుత్వాలపై తీవ్రమైన భారం పడుతుందని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో 5 శాతం కంటే ఎక్కువ ఎక్సెస్ టెండర్లు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్ అండ్ బి శాఖలో 34 ప్యాకేజీలు, పంచాయతీ రాజ్‌లో 17 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారని.. ఒకే కంపెనీకి 15 టెండర్లు దక్కబోతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చేసే అప్పులతో పాటుగా, పరోక్షంగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంశంపైనా హరీష్ రావు ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల సమయంలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాడారని గుర్తు చేశారు. అప్పుడు అలా మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చారని మండిపడ్డారు. 2014 బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని రద్దు చేశామని, తమ ప్రభుత్వ హయాంలో 5 శాతం కంటే ఎక్కువగా టెండర్ ఉంటే వెంటనే రీ కాల్ చేసేవాళ్లం అని పేర్కొన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం టెండర్ ఎక్సెస్ వేస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎక్సెస్ టెండర్‌లను వెంటనే రద్దు చేయాలని, టెండర్‌లు అన్నీ రీ కాల్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతుందని, ఇదే విషయాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆధారాలతో సహ తాము వివరించామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఉంటారు, రేపు పోతారు..ఎక్సెస్ టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని చెప్పారు. ఈ టెండర్లలో ఒక కంపెనీకి 15 టెండర్లు దక్కబోతున్నాయని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడుతానని వెల్లడించారు. ఆర్ అండ్ బి శాఖలో రిటైర్ అయిన చీఫ్ ఇంజనీరింగ్ వెంకటేశ్వరరావు, పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ జోగారెడ్డి పదవి కాలం పొడిగించి,ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అడ్వైజర్లు ఉండరని, ఎక్స్‌టెన్షన్ ఉండదని మాట్లాడిన సిఎం, అధికారంలోకి రాగానే ప్రధానమైన ఇంజనీరింగ్ విభాగంలో అధికారులను ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నారని విమర్శించారు.










