
కోల్కతా విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మధ్య అగర్తలా బయలుదేరాల్సిన ఇండిగో విమానాన్ని పిడుగు తాకింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం, ఇండిగోకు చెందిన 6E6068 విమానం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఏరోబ్రిడ్జ్ 56ఎల్ వద్ద నిలిచి ఉండగా పిడుగు తాకింది. ఆ సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. పిడుగు ప్రభావంతో విమానం విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని ఆకస్మికంగా పవర్ నిలిచిపోయింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఏఓసీసీ) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రయాణికులందరినీ వెంటనే విమానం నుంచి దించారు.
అనంతరం వారిని మరో ఇండిగో ఏ321 విమానంలో అగర్తలాకు పంపించారు. ఉదయం 9.20 గంటలకు బయలుదేరాల్సిన విమానం చివరకు మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. ఇండిగో సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఘటన సమయంలో ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ స్వల్పంగా ప్రభావితమయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి కోల్కతా నగరంతో పాటు పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు కొనసాగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోగా, రహదారి రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం విమాన సర్వీసులపైనా పడుతున్నట్లు అధికారులు తెలిపారు.













